పోలీస్ వ్యవస్థలో కానిస్టేబుల్ పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ప్రజల మాన, ప్రాణ రక్షణలో.. ఆస్తుల పరిరక్షణలో మొదట నిలిచేది వీరే. శిక్షణ వీరిని కీలకమైన విధులు నిర్వహించే పోలీసుగా మార్చుతుంది. రాత, శారీరక దారుడ్య పరీక్షల్లో విజయం సాధించి.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియ ఉమ్మడి జిల్లా యూనిట్ గా నిర్వహిస్తున్నారు.
అన్ని రకాల నైపుణ్యాలు...
ఒక జిల్లాకు చెందిన అభ్యర్థులను మరొక జిల్లాలోని పోలీస్ శిక్షణ కేంద్రానికి పంపిస్తారు. వీరికి 9 నెలల పాటు తరగతి గదిలో.. మైదానంలో రెండు విభాగాలుగా శిక్షణ ఇస్తారు. విధి నిర్వాహణకు అవసరమైన నైపుణ్యాలతో పాటు.. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే శారీరక.. మానసిక సవాళ్లు, ఒత్తిళ్లు ఎదుర్కొనేలా వీరిని తయారు చేస్తారు. ఆయుధాల వినియోగం నుంచి ప్రథమ చికిత్స చేయడం వరకు.. చట్టాలు, ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ క్రైం వంటి ఆధునిక అంశాలు సైతం దర్యాప్తు చేసేలా అన్ని రకాల నైపుణ్యాలు పెంపొందిస్తారు.
ఉదయం 6 గంటల నుంచి...
ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే వీరి శిక్షణ రాత్రి 8:30 గంటలకు ముగుస్తుంది. 6:00 గంటల నుంచి 7:30 వరకు వ్యాయామం, కవాతుపై శిక్షణ ఉంటుంది. అనంతరం స్నానం, అల్పహరం కోసం విరామం ఇస్తారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తరగతి గది శిక్షణ ఉంటుంది. 3:30 గంటల వరకు భోజన విరామం ఇస్తారు.
విధిగా...
3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయుధ శిక్షణ ఉంటుంది. అనంతరం 5:45 గంటల వరకు క్రీడలు ఉంటాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు రాత్రి భోజనం ఉంటుంది. 8 గంటలకు రోల్ కాల్ సమావేశం ఉంటుంది. దీనిలో ఆరోజు జరిగిన శిక్షణపై రివ్యూ, మరుసటి రోజుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. దీంతో ఆరోజు దినచర్య పూర్తవుతుంది.
రెండు సెమిస్టర్లుగా...
9 నెలల శిక్షణను రెండు సెమిస్టర్లుగా విభజించారు. ఇన్ డోర్ (తరగతి గది), అవుట్ డోర్ (మైదానం) అని రెండు విభాగాలుగా ఉండే ఈ శిక్షణలో పలు అంశాలపై శిక్షణ ఇస్తారు. పోలీస్ అడ్మినిస్ట్రేషన్, డాక్యుమెం టేషన్, భారత శిక్షా స్మృతి, భారతీయ ఆధారాల చట్టం, ప్రత్యేక, స్థానిక చట్టాలు, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్, ఫోరెన్సిక్ సైన్స్, ఇంటెలిజెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలు తరగతి గదిలో ఇచ్చే శిక్షణలో సబ్జెక్టులు.
క్షేత్రస్థాయి అవగాహన...
కవాతు, ఆయుధాల వినియోగం, ఫైరింగ్, పేలుడు పదార్థాల నిర్వీర్యం, సమూహాల నియంత్రణ ట్రాఫిక్ నియంత్రణ, ప్రథమ చికిత్స వంటి అంశాలు మైదాన శిక్షణలో ఉంటాయి. కానిస్టేబుల్ విధుల పట్ల క్షేత్రస్థాయి అవగాహన కోసం పోలీస్ స్టేషన్లకు సైతం పంపిస్తారు.
వీటన్నింట్లో నైపుణ్యం సాధించి ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగం ఇస్తారు. విజయవంతగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు దీక్షాంత్ కవాతు నిర్వహించి... విధినిర్వాహణకు పంపిస్తారు. శిక్షణకు వచ్చిన ప్రతి వ్యక్తి.. దీక్షాంత్ కవాతు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తాడు.
ఇదీ చదవండి:ఆన్లైన్ యోగా చేసేయ్.. ఆరోగ్యాన్ని పట్టేయ్..