Etela rajendar fires on KCR: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతు కుటుంబాలకు రుణం పుట్టక బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన యువజన దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని కేసీఆర్పై, బీఆర్ఎస్ ప్రభుత్వతీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయకుండా అబద్దాలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
గొప్పగా చెప్పుకునే తెలంగాణ సంక్షేమ పథకాలపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంటే కేసీఆర్ వెన్నులో ఎందుకు వణుకు పుడుతుందని ఈటల ప్రశ్నించారు. సీఎం, మంత్రుల పర్యటనల పేరుతో పోలీసులను అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలను అడ్డుకోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈటల జోస్యం చెప్పారు. అంతకుముందు పద్మశాలి భవన్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఈటల సందర్శించారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.