ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు దీక్ష విరమించను' తెలంగాణ ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్షను వరుసగా రెండో రోజూ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిన్నటి నుంచి ఆయన స్వీయ గృహనిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీక్ష విరమింపజేసేందుకు పోలీసులు ఆయనతో చర్చలు జరుపుతున్నారు.
కొనసాగుతున్న సమ్మె
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె వరుసగా 44వ రోజు కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. కార్మికులను అరెస్టు చేసి జీడిమెట్ల ఠాణాకు తరలించారు. జగిత్యాల డిపో ఎదుట కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. బస్సులను అడ్డుకున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట బైఠాయించారు. బస్సులను బయటకు తీయవద్దంటూ నినాదాలు చేశారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనూ అందోళనలు కొనసాగుతున్నాయి.
మందకృష్ణ మాదిగ అరెస్టు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా దీక్షకు బయలుదేరే సమయంలో హబ్సీగూడలోని ఓ లాడ్జిలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాచారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.