తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో ఉద్ధృతి మరింత పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వేగానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ రెండో వేవ్ ఉద్ధృతి మార్చి మధ్యలో మొదలైంది. దాదాపు నెలన్నర నుంచి పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ జన్యుక్రమాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు కొత్త విషయాలను గుర్తించారు.
పెరుగుదలకు కారణం
కొత్తగా వస్తున్న కేసుల్లో సగం వరకు బి.1.617 వైరస్ -డబుల్ మ్యుటెంట్ రకమే ఉండడంతో... ఇతర రాష్ట్రాల డేటాతో పోల్చి చూశారు. మహారాష్ట్రలో రెండో ఉద్ధృతి అన్ని రాష్ట్రాల కంటే ముందు ఫిబ్రవరిలో మొదలైంది. అప్ప టివరకు అక్కడ వ్యాప్తిలో ఉన్న ఎన్440కే రకం కనుమరుగై డబుల్ మ్యుటెంట్ విస్తరించింది. దీంతో అక్కడ అనూహ్యంగా కేసులు పెరిగాయి. మన దగ్గర మార్చి ప్రారంభం వరకు ఎన్440కే రకం వ్యాప్తిలో ఉండేది. దీని స్థానంలో నెలన్నర రోజుల్లోనే డబుల్ మ్యుటెంట్ చాపకింద నీరులా విస్తరించి... కేసుల పెరుగుదలకు కారణమైంది. ఈ రెండింటిని పోల్చి విశ్లేషించిన శాస్త్రవేత్తలు... కేసుల పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్ కారణమైందని నిర్ధరణకు వచ్చారు.