తెలంగాణ

telangana

ETV Bharat / state

Dumping Yard: ఆ 18 గ్రామాలకు ఊపిరాడడం లేదు! - rangareddy district news

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు గాలిలోకి విషం చిమ్ముతోంది. చుట్టూ ఉన్న 18 గ్రామాల ప్రజలు దుర్గంధంతో శ్వాస పీల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాల నిర్వహణలో లోపాలతో తమ బతుకులు ఛిద్రమవుతున్నాయని అధికార పార్టీ నేతలే నిరసన గళం వినిపిస్తుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. రాబోయే చలికాలాన్ని తలచుకుంటే భయం రెట్టింపవుతోందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

surrounding-villages-troubled-by-jawahar-nagar-dumping-yard
surrounding-villages-troubled-by-jawahar-nagar-dumping-yard

By

Published : Oct 22, 2021, 1:40 PM IST

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు గాలిలోకి విషం చిమ్ముతోంది. గాఢ దుర్గంధంతో జనం శ్వాస పీల్చుకోలేకపోతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో.. డంపింగ్‌ యార్డు చుట్టూ ఉన్న 18 గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు. రెండున్నర లక్షల మంది స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాల నిర్వహణలో లోపాలతో తమ బతుకులు ఛిద్రమవుతున్నాయని అధికార పార్టీ నేతలే నిరసన గళం వినిపిస్తుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటీవల తమ ప్రాంత ప్రజల సమస్యను దమ్మాయిగూడ పురపాలక సంస్థ ఛైర్‌పర్సన్‌ ప్రణీత ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.

సరిపోని నిర్వహణ సామర్థ్యం..

డంపింగ్‌ యార్డు నిర్వహణ పనులు మొదలైనప్పుడు గ్రేటర్‌ నుంచి రోజూ 2,500 - 3,500టన్నుల చెత్త అక్కడికి చేరేది. దానికి తగ్గట్లు నిర్వహణ సంస్థ రాంకీ ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పుడు 7,500 టన్నుల చెత్త నిత్యం తరలుతుండటంతో సమస్య తీవ్రమైంది.

అడుగడుగునా నిర్వహణ లోపాలు..

* సామర్థ్యం సరిపోక రాంకీ సంస్థ రోజువారీ చెత్తలో సగం టిప్పింగ్‌ ఫ్లోర్‌పై బహిరంగంగా పడేస్తోంది.

* చెత్త నుంచి వచ్చే మురుగుతో మల్కారం చెరువు నిర్జీవమైంది. భూగర్భ జలం కలుషితమై పొలాలు బీళ్లుగా మారాయి. గాలి వీచినప్పుడు చెరువు చుట్టూ వాసన తీవ్రంగా ఉంటుంది.

ప్రత్యామ్నాయాలే పరిష్కారం..

ఈ యార్డుపై ఒత్తిడి పెరిగిందని జీహెచ్‌ఎంసీ ఈఈ శ్రీనివాస్‌ అన్నారు. కనీసం మరో రెండు ప్రత్యామ్నాయ యార్డులుండాలని, నగరం చుట్టూ నాలుగు చోట్ల నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

*పేరుకు పోయిన వ్యర్థాలు.. 14 మిలియన్‌ టన్నులు

*డంపింగ్‌ యార్డు విస్తీర్ణం.. 351 ఎకరాలు

ప్రభావిత గ్రామాలు..

హరిదాసుపల్లి, చెన్నాయిపల్లి, జవహర్‌నగర్‌, బాలాజీనగర్‌, అంబేడ్కర్‌నగర్‌, మల్కారం, రాజీవ్‌గాంధీ నగర్‌, కార్మిక నగర్‌, గబ్బిలాలపేట, శాంతి నగర్‌, ప్రగతి నగర్‌, బీజేఆర్‌ నగర్‌, దమ్మాయిగూడ, అహ్మద్‌గూడ, తిమ్మాయపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి

పది రోజులుగా తీవ్రమైన వాసన...

పదిరోజులుగా తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇంటి తలుపులు తెరవలేకపోతున్నామని అంటున్నారు. గాలితో పాటు చెరువులు, కుంటలు తీవ్రంగా కలుషితమవుతున్నాయని తెలిపారు. రాబోయే చలికాలాన్ని తలచుకుంటే భయం రెట్టింపవుతోందన్నారు. దోమలు, ఈగలు, ప్లాస్టిక్‌ కవర్లు, చెత్త కాగితాలతో జనావాసాలు మురికి కూపాలుగా మారుతున్నాయని... ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

ఇదీ చదవండి:Huzurabad by election: ఉత్కంఠ రేపుతోన్న హుజూరాబాద్​ పోరు.. విజయబావుటా ఎగరేసేదెవరు..?

ABOUT THE AUTHOR

...view details