Satvik Suicide Note Found : నగర శివారులో గల నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి తరగతి గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా సాత్విక్ వద్ద లభ్యమైన సూసైడ్ నోట్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉంటున్న ప్రిన్సిపల్, కళాశాల ఇంఛార్జ్, లెక్చరర్ అయిన కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని... వారు వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.
'అమ్మానాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. అన్నా.. అమ్మానాన్నలను నువ్వే బాగా చూసుకోవాలి. అన్నా.. నేను లేనిలోటును అమ్మానాన్నలకు రానీయకు. ప్రిన్సిపల్, ఇన్‌ఛార్జ్, లెక్చరర్ల వల్లే చనిపోతున్నా. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ వేధింపులు తట్టుకోలేక పోతున్నా. ఈ ముగ్గురూ హాస్టల్‌లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నన్ను వేధించిన ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్.'-సూసైడ్ నోట్లో సాత్విక్ మాటలు
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని శ్రీచైతన్యం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన 'రాజప్రసాద్-అలివేలు' దంపతులు వ్యాపారం నిమిత్తం షాద్‌నగర్‌లో ఉంటున్నారు. వీరి కుమారుడు సాత్విక్... నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల శివరాత్రి సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చిన సాత్విక్... మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో తరగతి గదిలో ఉరేసుకున్నాడు.
వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి : సాత్విక్ వసతిగృహంలో కనిపించకపోవడంతో స్నేహితులు... క్లాస్ రూమ్‌ల్లో వెతికారు. తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. ఎవరూ స్పందించపోవటంతో సాత్విక్‌ను వారే భుజాలపై ఎత్తుకుని బయటికి తీసుకొచ్చారు. ఇతరులను లిఫ్ట్ అడిగి... ఆస్పత్రికి తరలించగా, అప్పటికే సాత్విక్ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. తోటి విద్యార్థుల ముందే అవమానించేలా మాట్లాడటం, దుర్భాషలాడటంతో సాత్విక్ మానసికంగా కుంగిపోయాడని కుటుంబసభ్యులు వాపోయారు. సాత్విక్ మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.