Ramanuja Sahasrabdi Utsav : సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు త్రిదండి చినజీయర్ స్వామి.. శ్రీలక్ష్మీనారాయణ మహాయాగాన్ని వేలాది మంది రుత్వికుల హవనం మధ్య ప్రారంభించారు. మంత్రపూర్వకంగా అగ్నిహోత్రాన్ని రగిలించి 114 యాగ మండపాల్లోని 1035 కుండలాల్లో.. ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులు హోమాలను మొదలుపెట్టారు. ఉదయం 10 గంటలకు మొదలైన శ్రీలక్ష్మీనారాయణుడి మహాయజ్ఞం మధ్యాహ్నాం ఒంటిగంట వరకు సాగింది. ఆ తర్వాత చినజీయర్ స్వామి ప్రవచన మండపంలో రామానుజచార్యుల అష్టోత్తర శతనామావళి పూజను ఆరంభించారు. సుమారు 200 మంది భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు.
నాలుగు దిక్కుల్లో నాలుగు పేర్లతో మండపాలు: చినజీయర్ స్వామి
యాగశాలలను నాలుగు భాగాలుగా విభజించినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. ఉదయం హోమాల ప్రారంభం సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. శ్రీరంగ క్షేత్రానికి సూచికగా భోగ మండపం, తిరుమలకు పుష్ప మండపం, కాంచీపురానికి త్యాగమండపం, మేల్కొటె క్షేత్రానికి జ్ఞాన మండపంగా పేర్లు నిర్ణయించినట్లు వివరించారు. ఈ నాలుగు క్షేత్రాలతో రామానుజాచార్యులకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. యాగాల సందర్భంగా భక్తులందరూ భగవన్నామస్మరణపైనే దృష్టి పెట్టాలన్నారు. దేవుడిని భయంతో కాకుండా భక్తితో కొలవాలన్నారు.
ఇక్కడ నుంచే ప్రపంచానికి శాంతి సందేశం..
సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. చినజీయర్ స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహ ప్రాంగణంలోని ఆవిష్కరణ ఏర్పాట్లను, భద్రతను పరిశీలించారు. అనంతరం యాగశాలకు చేరుకొని పెరుమాళ్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సమతామూర్తి కేంద్రం ప్రాధాన్యతను వెల్లడించిన కేసీఆర్.. ప్రపంచంలోనే అద్భుత పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుందని ఆకాంక్షించారు. ప్రపంచానికి ఇక్కడి నుంచి శాంతి సందేశం వెళ్తుందన్న ముఖ్యమంత్రి.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని చినజీయర్ స్వామి మరింత అభివృద్ధి చేస్తారన్నారు.
అష్టోత్తర శతనామ పూజ...