Rabi season Rythu bandhu: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సంబంధించి.. రెండో రోజు రైతుబంధు పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇవాళ 1,255.42 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. నిన్న, నేడు కలిపి రూ.1,799.99 కోట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రెండో రోజు 17,31,127 మంది లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందిందని.. ఈ రెండు రోజుల్లో కలిపి 35,43,783 మంది రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వివరించారు.
వంద శాతం పైగా
రైతు కష్టం తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధు ఉద్దేశం డబ్బుల పంపిణీ కాదని.. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగంలోని ప్రతి ఎకరం సాగులోకి రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యవసాయ అనుకూల విధానాలతో పంటల ఉత్పత్తులు వందశాతం పైగా పెరిగాయని మంత్రి వెల్లడించారు. సాగు, పంట ఉత్పత్తులు పెరగడంతో అనేక రంగాలకు ఉపాధి లభించిందని హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని వ్యాపార రంగంగా కాకుండా..ఉపాధి రంగంగా చూడాలని సూచించారు. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని... దేశంలో అలా చూసిన ఒకే ఒక్క నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.