Revant Reddy on SC ST Declaration :రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కేవీఆర్ మైదానంలో.. కాంగ్రెస్ ప్రజాగర్జన పేరుతో బహిరంగ సభను (Praja Garjana Public Meeting ) నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ మలికార్జున ఖర్గే హాజరయ్యారు. తొలుత గద్దర్ చిత్రపటానికి ఏఐసీసీ చీఫ్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే దళిత, గిరిజన కాంగ్రెస్ నేతలు ఖర్గేను సన్మానించారు. మరోవైపు పలువురు నాయకులు.. ఆయన సమక్షంలో హస్తం పార్టీలో చేరారు.
ఈ క్రమంలోనే పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని రేవంత్‌రెడ్డి (Revant Reddy ) గుర్తు చేశారు. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి.. 12 అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని తెలిపారు. చేవెళ్ల గడ్డ మీద నుంచి.. సోనియా గాంధీ సూచన మేరకు దీనిని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ చేతిలో దళితులు, గిరిజనులు మోసపోయారని విమర్శించారు. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ పనుల్లో కూడా వీరికి రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.6 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. దళితులు, గిరిజనులకు 3 కార్పొరేషన్ల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే.. కొత్తగా 5 ఐటీడీఏలు.. 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10,000.. డిగ్రీ పాస్ అయితే రూ.25,000, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, పీహెచ్‌డీ, ఎంఫిల్ పూర్తి చేసిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.. ప్రతి మండలంలో గురుకుల పాఠశాలల ఏర్పాటుతో పాటు.. గ్రాడ్యుయేషన్, పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పించనున్నట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన దళితులకు 18శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.