తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడ ఇటుక పెడితే చాలు... రాజకీయ రాబందులు వస్తాయ్‌ - Relatives of leaders collecting money from people

ప్రజల ఓట్లతో గెలిచి.. అభివృద్ధికి బాసటగా నిలుస్తామని పదవులు అధిష్ఠించిన ప్రజాప్రతినిధులు వారు.. కానీ, ప్రస్తుతం వారి బంధువులు రాబందుల్లా సామాన్యుల నుంచి డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. చేసిన ఖర్చంతా అక్రమ వసూళ్ల ద్వారా రాబట్టాలన్న ఉద్దేశంతో ఎక్కడైనా నిర్మాణం మొదలైతే చాలు.. రాబందుల్లా వాలిపోయి వసూళ్లకు తెగబడుతున్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్ల బంధువులు సాగిస్తున్న అరాచకమిది.

Relatives of leaders collecting money from people in shamshabad
నాడు ఓట్ల కోసం... నేడు నోట్ల కోసం...

By

Published : Sep 22, 2020, 7:42 AM IST

Updated : Sep 22, 2020, 8:09 AM IST

శంషాబాద్‌లో అక్రమాలకు తెరలేపారు ప్రజాప్రతినిధుల బంధువులు. రాబందుల్లా సామాన్యుల నుంచి డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. ఇళ్లు, ఇతర భవనాలకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ‘ఐదుగురు’ రెచ్చిపోతున్నారు. మున్సిపాలిటీలో ఓ ప్రజాప్రతినిధి బంధువు, మరో కీలక ప్రజాప్రతినిధితోపాటు ముగ్గురు కౌన్సిలర్ల బంధువులు కలిసి ‘5మెన్‌ కమిటీ’గా ఏర్పడ్డారు. మూడు నెలలుగా పట్టణంలో ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా నిర్మాణదారులపై బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడుతున్నారు.

గజానికి వెయ్యి చొప్పున

శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌ ప్రాంతం... నగరానికి చెందిన ఓ వ్యాపారి గతేడాది వెయ్యి గజాలు కొన్నాడు..ఈ మధ్యనే ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. ఓ రోజు ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వచ్చి ఇంటి నిర్మాణాన్ని పరిశీలించాడు. ఆ తర్వాత మధ్యాహ్నానికి ఓ ప్రజాప్రతినిధి బంధువు నుంచి వ్యాపారికి ఫోన్‌ వచ్చింది. వెయ్యి గజాలకు గజానికి వెయ్యి చొప్పున రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌..! లేకపోతే ఇప్పటివరకు కట్టిన ఇంటిని కూలగొట్టడమే కాకుండా భవిష్యత్తులో ఇల్లు కట్టనివ్వమని హెచ్చరించాడు. చేసేది లేక ఆ మేరకు సమర్పించుకున్నాడు.

ఫుట్‌పాత్‌ను కూలగొట్టి నిర్మాణం

ఇదే ప్రాంతంలో ఓ ప్రజాప్రతినిధి ఏకంగా రహదారిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టగా కనీస చర్యలు కరవయ్యాయి. ఇంటి నిర్మాణం జరుగుతున్న చోట ఫుట్‌పాత్‌ను కూలగొట్టి ఎలాంటి సెట్‌బ్యాక్‌ లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సామాన్యులు ఇల్లు కట్టుకుంటే అక్రమ వసూళ్లకు పాల్పడుతుండగా.. ఓ ప్రజాప్రతినిధి ఏకంగా ఫుట్‌పాత్‌ను కూలగొట్టినా అధికారులు, తోటి ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు.

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగే ఏజెంటు

ఏళ్ల తరబడి మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి.. కమిటీకి ఏజెంటుగా వ్యవహరిస్తున్నాడు. పట్టణంపై అతనికి బాగా ‘పట్టు’ ఉండటంతో వివరాల సేకరణ బాధ్యత అప్పగించారు. నిత్యం ఉదయాన్నే సదరు ఉద్యోగి.. రెండు కాలనీలకు వెళ్లి కొత్త నిర్మాణాలు, అదనపు అంతస్తులు వేస్తున్న భవనాల ఫొటోలు తీసుకుని కమిటీకి అందజేస్తాడు. తర్వాత కమిటీ సభ్యులుభవన యజమానులకు ఫోన్‌ చేసి గజానికి రూ.వెయ్యి చొప్పున లేదా అంతస్తుకు రూ.లక్ష చొప్పున కట్టాలని ఒత్తిడి చేస్తారు. లేదంటేనిబంధనల ప్రకారం లేదని కూలగొట్టిస్తామని బెదిరిస్తారు. ఇందులో కీలక ప్రజాప్రతినిధి బంధువు 30 శాతం తీసుకుని, మిగిలిన నలుగురు 70 శాతం పంచుకుంటున్నట్లు తెలిసింది. వీరి ఆగడాలకు అధికారులఅండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఎవరైనాడబ్బుఇవ్వకపోతే.. అధికారులు రంగ ప్రవేశం చేసి అక్రమ నిర్మాణం అంటూ కూలగొడతారు.

కొన్ని ఉదాహరణలు ఇవీ..

రాళ్లగూడకు చెందిన ఓ వ్యక్తి సామ ఎన్‌క్లేవ్‌లో ఐదంతస్తుల ఇల్లు కడుతున్నాడు. రూ.5 లక్షలు డిమాండ్‌ చేయగా.. ఇప్పటికే రూ.2లక్షలు ఇచ్చినట్లు తెలిసింది.

నగరానికి చెందిన ఓ వ్యక్తి.. సామ ఎన్‌క్లేవ్‌లో మూడంతస్తుల ఇల్లు కడుతుండగా రూ.3 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

తొండుపల్లి హైవేపై ఓ వ్యక్తి వేయి గజాలలో ఇల్లు కడుతున్నాడు. అతని వద్ద రూ.2 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం స్థానికంగా ఉండే ఓ ప్రజాప్రతినిధికి తెలిసి తాను ఉన్న ప్రాంతంలో వసూలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

రాళ్లగూడలో వాణిజ్య అవసరాల కోసం ఓ స్థలాన్ని అభివృద్ధి చేయగా.. అనుమతుల కోసం రూ.లక్ష డిమాండ్‌ చేశారు. చివరికి సదరు వ్యాపారి రూ.70 వేలు ఇచ్చాడు.

ఇదీ చదవండి:సబ్‌ రిజిస్ట్రార్‌, రెవెన్యూ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ అనుసంధానం వేగవంతం

Last Updated : Sep 22, 2020, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details