Rahul Gandhi Fires on BJP and TRS: తెరాసతో ఎలాంటి అవగాహన కానీ.. పొత్తు కానీ ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తెరాసతో పొత్తు ఉండరాదని కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం నిర్ణయించిందని.. ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్టు రాహుల్ చెప్పారు. ఆరో రోజు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. కొత్తూరు మండలానికి చేరుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు రాహుల్ వెంట నడిచారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద భోజన విరామం అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రాహుల్.. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస విధానాలను ఎండగట్టారు.
భాజపా, తెరాస రెండు పార్టీలూ ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌పైనా రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొంతమంది ఎవరికి వారే తమది పెద్ద పార్టీగా ఊహించుకుంటున్నారని, అంతర్జాతీయ పార్టీగా ప్రకటించుకొని అమెరికా, చైనాలోనూ పోటీ చేయవచ్చని రాహుల్ ఎద్దేవా చేశారు.
తెరాసతో కాంగ్రెస్‌కు ఎలాంటి పొత్తు ఉండదు. ఈ విషయంలో కాంగ్రెస్ చాలా స్పష్టతతో ఉంది. కావాలనే తెరాస వర్గాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. తెరాసతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని మరోసారి కరాఖండిగా చెబుతున్నా. ఏ నాయకుడైనా తన పార్టీని ఎలాగైనా ఊహించుకునే హక్కు ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తాను నడిపే పార్టీని జాతీయపార్టీగా నమ్ముతున్నారు. దానికి ఎలాంటి సమస్యా లేదు. అంతర్జాతీయ పార్టీని నడుపుతున్నాడని తాను అనుకుంటే దాన్ని అంగీకరించవచ్చు. అవసరమైతే అమెరికా, చైనాలోనూ పోటీపడతానని తాను ఊహించుకుంటే మేం సంతోషంగా స్వాగతిస్తాం.- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
భాజపా విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నట్లు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన రాహుల్.. అవినీతి డబ్బుతో ఆ పని చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో.. రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరగనుందని, ఇది విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్యేనని తెలిపారు. ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని చెప్పిన రాహుల్.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు. యాత్ర కశ్మీర్‌కు చేరుకున్నాక రాజకీయ అంశాలకు గట్టిగా బదులిస్తానని తెలిపారు.