Telangana Realtors Murder Case: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడ కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివాదాస్పద స్థలం పక్కనే ఉన్న భూ యజమాని మట్టారెడ్డితో పాటు నవీన్, హఫీజ్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణంగూడ భూమి విషయంలో మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన హత్యకు శ్రీనివాస్ రెడ్డి కుట్రపన్నినట్లు తెలుసుకున్న మట్టారెడ్డి.. తన అనుచరులతో కలిసి హత్యకు ప్రణాళికలు రచించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సాయంత్రం వివరించనున్నారు.
మంగళవారం ఉదయం ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఘటనాస్థలంలోనే స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్ రెడ్డి చనిపోగా.... చికిత్స పొందుతూ రాఘవేందర్ రెడ్డి మృతిచెందారు. తమపై కాల్పులు జరిపింది ఎవరో తెలియదని చెప్పిన రాఘవేందర్ రెడ్డి.. అంతలోనే పరిస్థితి విషమించటంతో ప్రాణాలు విడిచారు. కాల్పుల గురించి తెలుసుకునే లోపే ఆయన చనిపోవటంతో కేసు విచారణ పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో సాంకేతిక ఆధారాలపైనే దృష్టి సారించిన పోలీసులు... మృతుల కాల్‌డేటా, సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా విచారణ సాగిస్తున్నారు.