తెలంగాణ

telangana

ETV Bharat / state

విస్తరణ, అభివృద్ధి పేరుతో నాలాల విషయంలో అలక్ష్యం

'మహానగరంలో నాలాలు విస్తరిస్తాం.. వాటిపై జాలీలు నిర్మిస్తాం.. చుట్టూ ప్రహరీలు నిర్మిస్తాం' అంటూ చెప్పే యంత్రాంగం ప్రకటనలు గాలిమూటలవుతున్నాయి. ఏటా వీటి వద్ద జరుగుతున్న ప్రమాదాలతో అనేక కుటుంబాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. రూ.230 కోట్లతో మూడేళ్ల క్రితం మొదలైన పనులు 20 శాతం కూడా పూర్తికాని దుస్థితి. ఫలితంగా ఓపెన్‌ నాలాల బారినపడి చిన్నారులు, గర్భిణులు, యువకులు అసువులు కోల్పోతున్నారు.

carelessness in drainage system in hyderabad
విస్తరణ, అభివృద్ధి పేరుతో నాలాల విషయంలో అలక్ష్యం

By

Published : Sep 19, 2020, 9:01 AM IST

2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాల అనంతరం అప్పటి ప్రభుత్వం కిర్లోస్కర్‌ కమిటీతో హైదరాబాద్​ నగరవ్యాప్తంగా సర్వే చేయించింది. 2007 తర్వాత ఓయెంట్స్‌ సంస్థ అధ్యయనం చేసింది. నాలాలపై ఉండే వేలాది నిర్మాణాల అడ్డు తొలగించి కట్టుదిట్టం చేయాలని, జనావాసాల్లో ఉన్నవాటిపై జాలీలు నిర్మించి జాగ్రత్తలు తీసుకోవాలని అవి సూచించాయి. ఎక్కడా అమలుకాలేదు. 2016లో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ విభాగాలతో అధ్యయనం చేయించారు. డ్రోన్లతో నాలాలను పరిశీలించారు. ఆ నివేదికా బుట్టదాఖలే. జేఎన్‌టీయూహెచ్‌ నిపుణుల నివేదిక పరిస్థితీ అంతే.

అలానే వదిలేస్తూ..

గొలుసుకట్టు చెరువుల మధ్య ఉండేవన్నీ ఓపెన్‌ నాలాలే. వీటి పొడవు 446 కి.మీ. కాలనీలు, మురికివాడలు, బస్తీల్లోనూ సన్నపాటి నాలాలు మనుగడలో ఉన్నాయి. వాటి పొడవు 200 కి.మీ వరకు ఉండొచ్చని అంచనా. నిబంధనల ప్రకారం వాటి మీద జాలీలు ఉండాలి. అధికారులు, గుత్తేదారులు పూడికతీత పనులను సొమ్ము చేసుకునేందుకు అలాగే వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి.

ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

  • జీడిమెట్ల నుంచి పాపయ్య యాదవ్‌నగర్‌ వరకు ఉన్న నాలా విస్తరణ జరగక ప్రమాదకరంగా ఉంది.
  • 2010లో కురిసిన భారీ వర్షాలకు వెంకటేశ్వర్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు నాలాలో కొట్టుకుపోయి మృతి చెందారు.
  • రెండేళ్ల క్రితం నాగోల్‌లో ఓ వ్యక్తి నాలాలో కొట్టుకుపోయి చనిపోయాడు.
  • మన్సూరాబాద్‌, సరూర్‌నగర్‌, కొత్తపేట, ఆర్‌కేపురం, హయత్‌నగర్‌ డివిజన్లలో ఓపెన్‌ నాలాలు ప్రమాదకరంగా ఉన్నాయి.
  • మోతీనగర్‌ డివిజన్‌ బబ్బుగూడ, రామారావునగర్‌, స్నేహపురి కాలనీ, లక్ష్మీనగర్‌, గాయత్రినగర్‌లో ఉన్న ఓపెన్‌ నాలాల్లో తరచూ చిన్న పిల్లలు పడి గాయపడుతున్నారు. పశువులూ పడిపోతున్నాయి.
  • ఉస్మాన్‌గంజ్‌ ఓపెన్‌నాలా గోషామహల్‌ పోలీస్‌ క్వార్టర్స్‌ మీదుగా వెళ్లి ఇమ్లిబన్‌ వద్ద మూసీలో కలుస్తుంది. దీనికి ఇరువైపులా వేలాది కుటుంబాలు ఉన్నాయి.
  • హుస్సేన్‌సాగర్‌కు పెద్దయెత్తున వరదను తీసుకొచ్చే కూకట్‌పల్లి నాలాకు చాలాచోట్ల రక్షణ గోడ లేదు.
  • సింగరేణి ఆఫీసర్స్‌ కాలనీ, సింగరేణి కాలనీ, మీటర్‌సెల్‌ ఆఫీస్‌ ప్రాంతాలలో నాలాలు దడ పుట్టిస్తున్నాయి.
  • పటేల్‌కుంట చెరువు వద్ద ప్రారంభమై హెచ్‌ఎంటీనగర్‌ చెరువులో కలిసే నాచారం పెద్ద నాలాలో తరచూ ప్రమాదాలే.

నగరంలో నాలాల పొడవు. 1221 కి.మీ.

అందులో ఓపెన్‌ నాలాలు 446 కి.మీ.

(వీటిలో మేజర్‌ నాలాలు 391 కి.మీ, ఇతర వరద కాలువలు 55 కి.మీ.)

ఇదీ చూడండి :'మా భూమిని అధికార పార్టీ నేతలు కాజేశారు'

ABOUT THE AUTHOR

...view details