తెలంగాణ

telangana

ETV Bharat / state

Mothkupally narsimhulu: 'దళిత బంధు దేశవ్యాప్తంగా అమలు చేయించగలరా.?' - mothkupally narsimhulu challenges to national parties

దళిత బంధు పథకంపై విమర్శలు గుప్పిస్తున్న రాష్ట్రంలోని జాతీయ పార్టీల నాయకులకు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సవాల్​ విసిరారు. ఈ పథకాన్ని విమర్శించడం మాని.. దేశవ్యాప్తంగా అమలు చేయించగలరా అని ప్రశ్నించారు. దళిత బంధును నిలిపివేయాలని ప్రయత్నిస్తున్న వారికి హుజూరాబాద్​ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ మేరకు హైదరాబాద్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Mothkupally narsimhulu
మోత్కుపల్లి నర్సింహులు

By

Published : Aug 6, 2021, 6:59 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. రాష్ట్రంలోని జాతీయ పార్టీల నాయకులకు సవాల్‌ విసిరారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్​ ఈ పథకాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు. కానీ ఈ పథకాన్ని జాతీయ పార్టీలు అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేస్తూ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. దళితులకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అంబేడ్కర్‌ వారసుడిగా చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్​ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దేశవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేయించగలరా అని ప్రశ్నించారు.

దళిత బంధు దేశవ్యాప్తంగా అమలు చేయించగలరా.?: మోత్కుపల్లి నర్సింహులు

'దళిత జాతి ఆర్థికంగా, సామాజికంగా పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్​ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో జాతీయ పార్టీలు ఈ పథకాన్ని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. ఆలేరులో అర్హులైన దళితులందరికీ దళిత బంధు అందించాం. విమర్శలు మాని మీ మీ కేంద్ర నాయకులతో మాట్లాడి దేశ వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయించగలరా?'

-మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి

జాతి అభివృద్ధే ముఖ్యం

దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకం అమలు చేస్తున్న కేసీఆర్‌కు అందరూ మద్దతుగా నిలవాలని మోత్కుపల్లి కోరారు. దేశంలో మానవత్వం ఉన్న మహాత్ముడు కేసీఆర్‌ అని కొనియాడారు. రాజకీయాల కంటే జాతి అభివృద్ధే ముఖ్యమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌కు దళితులు ఎవరూ ఓటు వేయరని... హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని కుట్రలు చేసే వారికి, ఈటల రాజేందర్‌కు దళితులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఇదీ చదవండి:Crime: సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details