ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇతర అధికారులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పటాన్చెరు శివారు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మహిపాల్ రెడ్డి పలు సూచనలు చేశారు.
వారిలో నమ్మకం కల్పించండి..
స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయంతో తరగతులు నిర్వహించేందుకు... అనుకూలంగా పాఠశాలలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు. వేలాది మంది విద్యార్థులు ప్రత్యక్షంగా తరగతులకు హాజరు అవుతారని.. నిబంధనలు అమలు చేస్తూ పాఠశాలలో సురక్షితమన్న భావన తల్లిదండ్రుల్లో కల్పించాలన్నారు.
తనిఖీలు తప్పనిసరి..
విద్యార్థులకు ప్రతిరోజు థర్మామీటర్‌తో తనిఖీ చేసి, విధిగా మాస్కు ధరించి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో 160 పాఠశాలకు తన సొంత నిధులతో 9, 10 తరగతుల విద్యార్థులకు రెండు మాస్కులు, శానిటైజర్, పాఠశాలకు థర్మామీటర్ అందజేస్తున్నట్లు తెలిపారు.