Hotel Manager Shot Dead at Miyapur in Hyderabad :పొట్టకూటి కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చి.. ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరారు. వేరు వేరు ప్రదేశాల వారైనా మిత్రులుగా మారారు. ఉన్నత స్థాయి హోదా ఉద్యోగం కోసం.. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి తూటాలతో ప్రాణం తీసే పరిస్థితి ఏర్పడింది. మియాపూర్ కాల్పుల హత్యకేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల స్నేహితుడిని అంతమొందించినట్లు విచారణలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ కోల్‌కతాకు చెందిన దేబేందర్ గయాన్ కొంత కాలం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. మియాపూర్‌లోని సందర్శిని ఎలైట్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కేరళ నుంచి వచ్చిన రితేష్ నాయర్ కూడా ఇదే హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
Elite Restaurant Gunfiring Incident Miyapur : వీరిద్దరూ ఒకేసారీ ఉద్యోగంలో చేరడంతో మిత్రులయ్యారు. కొన్నిరోజుల తర్వాత హోటల్‌లో జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీగా ఉంది. వీరిద్దరి మధ్య జనరల్ మేనేజర్ హోదా కోసం పోటీ పెరగడంతో తరచు హోటల్‌లో గొడవలు పడుతుండేవారు. అయితే దేబేందర్‌కు హోటల్ యాజమాన్యంతో సన్నిహిత సంబంధాలుండేవి. దాంతో జనరల్ మేనేజర్‌గా పదోన్నతి లభించింది.
దీంతో రితేష్‌కు, దేబేందర్‌కు మధ్య గొడవలు మరింత తీవ్రమయ్యాయి. రితేష్ ప్రవర్తనతో విసిగిపోయిన దేబేందర్.. యాజమాన్యంకు ఫిర్యాదు చేయడంతో రితేష్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో రితేష్.. దేబేందర్పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతణ్ని అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం బిహార్ వెళ్లిన రితేష్.. అక్కడ నాటు తుపాకి, తూటాలు కొనుగోలు చేశాడు.