రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పురపాలిక పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హరితహారంలో పాల్గొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటారు. రైతు వేదిక భవనాలకు భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని, రైతు వేదికల భవనాల నిర్మాణాలను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందని సబిత అన్నారు. రాబోయే మూడు ఏళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి ఫలాలను ఇచ్చేందుకు కృషి చేస్తుందని మంత్రి వివరించారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
'అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందేలా కృషి' - రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తాజా వార్తలు
ఆరోవిడతలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పురపాలిక పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హరితహారంలో పాల్గొన్నారు. రైతు వేదిక భవనాలకు ఆమె భూమి పూజ చేశారు.
ఆమనగల్ పురపాలిక పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం అడ్డంకులు తొలిగాయని మంత్రి సబిత చెప్పారు. రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. ప్రైవేట్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు జీతాలు చెల్లించాలని టీఎల్ఎఫ్ నాయకులు మంత్రికి వినతి పత్రం అందించారు. ఆమనగల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని మమతను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అనితారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.