తెలంగాణ

telangana

ETV Bharat / state

Ktr At Safran Facility: వాళ్లే రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్లు: కేటీఆర్‌

Ktr At Safran Facility: హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్‌ఓ ప్రపంచంలోనే పెద్దదవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. శంషాబాద్‌లో సాఫ్రాన్ ఏరో ఇంజిన్ ఫెసిలిటీని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోకి మరిన్ని ఏరోస్పేస్‌ సంస్థలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకరిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు.

By

Published : Jul 7, 2022, 3:25 PM IST

Updated : Jul 7, 2022, 7:46 PM IST

Ktr At Safran Facility
కేటీఆర్‌

Ktr At Safran Facility: విమానయానరంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఫ్రెంచ్‌ విమాన ఇంజన్‌ తయారి సంస్థ సాఫ్రాన్ హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో మరమ్మత్తుల విభాగాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రంలో సీఎఫ్‌, లీప్‌ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తులు లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సాఫ్రాన్‌ సంస్థ ప్రతినిధులు ఈ కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

విమానాల తయారీలో భారతదేశంతో 65 ఏళ్లకు పైగా భాగస్వామి అయిన దిగ్గజ ఫ్రెంచ్‌ సంస్థ సాఫ్రాన్‌కు ఇప్పటికే భారత్‌లో పలు రాష్ట్రాల్లో సౌకర్య కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్‌లో దాదాపు 200 మిలియన డాలర్ల పెట్టుబడితో రిపేర్లు, సర్వీసింగ్‌ కేంద్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపకరణాలతో ఏర్పాటు చేసింది. దీని ద్వారా వెయ్యి మందికి కొత్తగా ఉపాధి కల్పించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

భారత్‌లో మూడు కొత్త ఇంజిన్ల తయారీ కేంద్రాలను ప్రారంభించటంతో పాటు దేశంలో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే దిశగా 2025లో ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సఫ్రాన్‌ ప్రకటించింది. రానున్న నాలుగేళ్లలో భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లు పెరగనుందని సాఫ్రాన్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఒలివియన్‌ ఆండ్రీస్‌ వివరించారు. బెంగళూరులో తమ మూడో కేంద్రాన్ని ప్రారంభించినట్లు సాఫ్రాన్‌ సంస్థ తెలిపింది.

2025లో ఎంఆర్‌ఓ పూర్తయితే ప్రపంచలోనే అతిపెద్దదిగా నిలుస్తుంది. ఇది దేశానికే గర్వకారణం. హైదరాబాద్‌లో ఎంఆర్‌ఓ ఏర్పాటు చేసి సాఫ్రాన్‌ సంస్థ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించింది. దక్షిణాసియాలోని చాలా విమానరంగ సంస్థలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుంటాయని నమ్ముతున్నాను. ఏరోస్పేస్‌ రంగంలో ఈ పెట్టుబడులు చాలా మార్పులు తెస్తాయని భావిస్తున్నాను. ఇది ఇతర విమాన, రక్షణరంగ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. హైదరాబాద్‌ ప్రపంచంలోని ప్రత్యేకమైన టెక్నాలజీ హబ్‌గా రూపొందింది. ఇక్కడున్న పెట్టబడిదారులే రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్లని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడు చెబుతుంటారు. వారు సంతోషంగా ఉంటే వ్యాపారాన్ని విస్తరిస్తుంటారు. రాష్ట్రంలో వ్యాపార అవకాశాలను ప్రపంచం నలుమూలలా చాటుతుంటారు. -కేటీఆర్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

వేలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏరోస్పేస్, ఏవియేషన్ రంగాలకు అనుసంధానమయ్యాయని మంత్రి కేటీఆర్ వివరించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ నుంచి హైదరాబాద్ నిరంతరం అవార్డులు పొందుతోందని, జీఎంఆర్ చేపట్టిన టెర్మినల్ విస్తరణ డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్​కు అనుగుణంగా మరిన్ని టెర్మినల్స్ కూడా అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి యూరప్, యూఎస్​కు మరిన్ని డైరెక్ట్ ఫైట్స్ నడుపుతామన్న హమీ నెరవేర్చాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కేటీఆర్ కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 7, 2022, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details