CM Shiva raj Singh Chouhan met Chinna Jeeyar Swamy: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. చినజీయర్ స్వామిని కలిశారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన... నేడు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ దివ్యసాకేతానికి వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి చినజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామానుజాచార్య విగ్రహం ఏర్పాటు చేసిన స్థలాన్ని సందర్శించారు. ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటారు. రావిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా సమతామూర్తి విగ్రహావిష్కరణ, సంబంధిత కార్యక్రమాల గురించి.. మధ్యప్రదేశ్ సీఎంకు చిన జీయర్ స్వామి వివరించారు. రామానుజాచార్య విగ్రహావిష్కరణ, ఉత్సవాలకు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆయన ఆహ్వానించారు.
చినజీయర్‌స్వామిని కలిసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ ముఖ్య అతిథిగా మోదీ
ముచ్చింతల్ ఆశ్రమంలో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. కార్యక్రమంలో ఆయనతోపాటు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
భారీ ఎత్తున హోమాలు
ఉత్సవాలు నిర్వహించే రోజులలో భారీఎత్తున హోమాలు జరగనున్నాయి. సమతామూర్తి విగ్రహానికి సమీపంలోనే దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏర్పాట్లు చేశారు. 35 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5వేల మంది రుత్వికులు, వేదపండితులు విచ్చేసి క్రతువులో పాల్గొంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి. మొత్తం 114 యాగశాలల్లో తొమ్మిది చొప్పున హోమగుండాలు ఉంటాయి. దేశీయ ఆవు పాల నుంచి సేకరించిన 2 లక్షల కిలోల స్వచ్ఛమైన నెయ్యిని హోమాలకు వినియోగించనున్నారు.
ఇదీ చదవండి:Dalithabandhu: రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు