Kishan Reddy on TRS MLAs Buying Issue: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు.. భాజపాకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డబ్బులు లభించలేదని.. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం కొత్త కాదని వ్యాఖ్యానించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ప్రజాప్రతినిధులు పార్టీలు మారారని గుర్తు చేశారు. మునుగోడు ఎన్నికలు పటిష్ఠంగా నిర్వహించాలని తమ పార్టీ కోరిందని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ మీడియా నానా హంగామా చేస్తోందని.. కల్లోలమంతా మీడియాలోనే ఉందని పేర్కొన్నారు. సమాజం ప్రశాంతంగానే ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.
"కొనుగోలు వ్యవహారంలో మాకు సంబంధం లేదు. స్వామిజీకి మాకు సంబంధం లేదు. ఆడియోలో ఎక్కడా డబ్బుల విషయం రాలేదు. పార్టీల చేరిక అనే విషయం వచ్చింది. అందులో కొత్తేముంది. పార్టీలో చేరడం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది చేరలేదా. తెదేపా, వైసీపీ వారు చేరలేదా. కేటీఆర్ భాజపా వారిని చేరమని అడగలేదా. ఇందులో ఏముందని మీరు తొందరపడుతున్నారు. ఇవన్ని బోగస్. ప్రభుత్వమే వెనకకు జరిగింది. మీడియా తొందరపడుతుంది. వాళ్లతో మాకు సంబంధం లేదు." - కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
మరోవైపు తెరాస ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చాలంటూ భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించింది. నగదు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీని కోరారు. మరోవైపు ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చిన భాజపా.. తప్పుడు ఆరోపణలతో భాజపా ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని ఫిర్యాదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ శనివారానికి వాయిదా పడింది.