Hyderabad Meteorological Center: రాష్ట్రాన్ని వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన వర్షాలు మరో 2 రోజుల పాటు కురుసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. సోమవారం ఇదే మాదిరిగా వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
నిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్బ వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక, మరఠ్వాడ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగుతుందని వివరించారు. ప్రజలు మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బయటకి వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పడిన వడగళ్ల వర్షానికి తీవ్ర నష్టం జరిగిందని గుర్తు చేశారు. రైతులు అధికంగా పంట నష్టం జరిగిందని వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో పడే వర్షాలను తట్టుకునే విధంగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈరోజు మోస్తారు వర్షాలు వస్తాయని.. దానికి తగినట్టు వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు.