తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్న మాజీ ఎమ్మెల్యే రాములు - ప్రజాసేవ చేసే నాయకుడ్ని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి

EX MLA Kondigari Ramulu Story : ఆయనొక మాజీ ఎమ్మెల్యే. రాజకీయం అంటే డబ్బు ప్రధానం కాదని నిరూపించిన ప్రజాసేవకుడు. ఆయనే కొండిగారి రాములు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అయితే ఇప్పటి నాయకుల్లా ఆయన ఓటుకు నోటు పంచలేదు. ప్రజల ఆదరణతో గెలిచి తన జీతం డబ్బులను ప్రజల సంక్షేమం కోసమే ఖర్చుపెట్టిన పాలకుడు.

Telangana Assembly Elections 2023
EX. MLA Kondigari Ramulu Story

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 5:53 AM IST

నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్న మాజీ ఎమ్మెల్యే రాములు ప్రజాసేవ చేసే నాయకుడ్ని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి

EX. MLA Kondigari Ramulu Story : ఆయనొక మాజీ ఎమ్మెల్యే దశాబ్దకాలం పాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఇప్పటి నాయకుల్లా.. ఆయన ఓటుకు.. నోటు పంచలేదు. ప్రజల ఆదరణతో గెలిచి.. తన జీతం డబ్బులను ప్రజల సంక్షేమం కోసమే ఖర్చుపెట్టారు. 88 ఏళ్ల వయస్సులో సాధారణ జీవితాన్ని గడుపుతూ.. ఎంతో మంది నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే.. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు.

ఈ పెద్దాయన పేరు కొండిగారి రాములు. రాజకీయం అంటే డబ్బు ప్రధానం కాదని నిరూపించిన ప్రజాసేవకుడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు.. ఇబ్రహీంపట్నం నియోకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సీపీఎం తరపున 1989లో 4వేల ఓట్ల మెజార్టీతో ఓసారి.. 1999లో 29 వేల ఓట్ల మెజార్టీతో మరోసారి గెలుపొందారు. ప్రజల మనసులో ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలనే చెరగని ముద్రను వేసుకున్నారు.

''ఎమ్మెల్యే కదా బాగా సంపాదించి ఉంటారని కొందరు, అధికారంలో ఉన్నా కూడా రూపాయి సంపాదన లేదని మరికొందరు బాహాటంగానే అవమానించేవారు. ఎమ్మెల్యేగా నాకు వచ్చే జీతంలో వెయ్యి రూపాయలు మాత్రమే కుటుంబ పోషణకు ఖర్చుపెట్టుకొని మిగతా డబ్బును ప్రజల సంక్షేమం కోసం పార్టీ నిధికి విరాళంగా అందించేవాడిని. చివరకు కొడుకుల చదువులు, పెళ్లిళ్లు కూడా ఆశించిన స్థాయిలో చేయలేకపోయాను. క్యాన్సర్ భారినపడ్డ పెద్ద కుమారుడ్ని డబ్బు లేక కాపాడుకోలేకపోయాను." -కొండిగారి రాములు, మాజీ ఎమ్మెల్యే

Telangana Assembly Elections 2023 : ఎమ్మెల్యే అయితే చాలు.. కోట్లకు పడగెత్తువచ్చనే ఆశలు, ఆరాటాన్ని వదిలేసి... అతి సాధారణంగా జీవించి చూపించారు రాములు. చిన్నప్పుడు తండ్రి చెప్పిన మాటలు, పెద్దయ్యాక పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శాల బాటలో నడిచారు. బీసీ సంక్షేమ శాఖ శాసనసభ కమిటీ సభ్యుడిగా పనిచేసి.. పేదల పక్షాన నిలబడ్డారు. అధికారుల ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని నిలబడ్డారు. రాజకీయంగానే కాకుండా కుటుంబపరంగానూ రాములు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. క్యాన్సర్ బారినపడ్డ పెద్ద కుమారుడిని డబ్బు లేక కాపాడు కోలేకపోయారు.

'' ప్రస్తుతం రాజకీయాలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే ప్రజలు డబ్బు తీసుకొని ఓటుకు అమ్ముడుపోవద్దు. ప్రజాసేవ చేసే నాయకుడ్ని చూసి ఓటు వేయాలి." -కొండిగారి రాములు, మాజీ ఎమ్మెల్యే

ibrahimpatnam constituency EX. MLA Kondigari Ramulu Story : ప్రస్తుత రాజకీయాలు డబ్బు, మద్యం చుట్టూ తిరుగుతున్నాయని రాములు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాసేవ చేసే నాయకుడ్ని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో 120 గజాల్లోని చిన్న ఇంట్లో కుటుంబంతో కలిసి రాములు జీవిస్తున్నారు. 88 ఏళ్ల వయస్సులో తన పనులు తానే చేసుకుంటూ.. నిత్యం ఉదయపు నడక, వ్యాయామం, పుస్తక పఠనం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాజకీయ స్థితిగతులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్న రాములు.. నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details