DH on Ibramhimpatnam incident: ప్రభుత్వ ఆస్పత్రిలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగితే దురదృష్టవశాత్తు నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఘటనపై ఆయన మాట్లాడారు. మిగతా 30 మందికి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరిని గురువారం రాత్రి డిశ్చార్జ్ చేశారని.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు కలిపి మొత్తంగా 11 మందిని ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. మరో 18 మందిని రానున్న రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామన్నారు.
ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో 34 మందికి కు.ని శస్త్రచికిత్సలు జరిగాయి. దురదృష్టవశాత్తు నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మిగతా 30 మందికి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నిన్న ఒకరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం. ఇవాళ మరో 11 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న ఆరుగురిని డిశ్చార్జ్ చేస్తున్నాం. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిని డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పటివరకు 30 మందిలో 12 మంది బాధితులు డిశ్చార్జ్. మరో 18 మంది మహిళలను రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనకు గురికానవసరం లేదు.
- శ్రీనివాస్, డీహెచ్
ఈ ఘటనపై విచారణాధికారిగా వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిందని డీహెచ్ తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో పరిస్థితులపై సిబ్బందితో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన రోజు పనిచేసిన సిబ్బందిని విచారించినట్లు పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని స్పష్టం చేశారు. ఐదారేళ్లలో 12 లక్షలకు పైగా ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. వేసెక్టమీపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని.. అయినప్పటికీ ఎవరూ ముందుకు రావట్లేదన్నారు.
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన 34 మందిలో 25 మందికి ఇన్‌ఫెక్షన్ వచ్చిందని డీహెచ్ తెలిపారు. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక వచ్చిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాధితులు గ్యాస్ట్రో సమస్యతో ఆసుపత్రికి వచ్చారని డీహెచ్ అన్నారు. ఆపరేషన్ జరిగిన 36 గంటల తర్వాత సమస్య మొదలైందని వివరించారు. స్టెరిలైజేషన్‌లో ఇబ్బందులు జరిగాయేమోనని ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
స్టెఫాయిలో కొకస్ అనే బ్యాక్టీరియా కారణంగానే ఇన్ఫెక్షన్ వచ్చినట్లు నివేదికలో తెలిసిందని డీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. ఆపరేషన్ థియేటర్లో ఫ్యూమిగేషన్ ఎప్పటికప్పుడు చేస్తున్నారని తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనపై విచారణ చేపట్టామని.. ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. విచారణలో భాగంగా ఆస్పత్రిలో పరిస్థితులపై సిబ్బందితో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన రోజు పనిచేసిన సిబ్బందిని విచారించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని డీహెచ్ తెలిపారు.
ఈ ఘటన చాలా బాధాకరం.. రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక: డీహెచ్ ఇవీ చదవండి:Ibrahimpatnam incident: 'బాధిత కుటుంబాలకు 50 లక్షల పరిహారం చెల్లించాలి'