Teachers Transfers in Telangana: భార్యాభర్తల కేటగిరీలో ఉపాధ్యాయుల నుంచి భారీగా దరఖాస్తులు అందాయన్నారు. వారందరికీ ఆ జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇస్తే కొన్నేళ్లపాటు ఖాళీలు లేక రిక్రూట్‌మెంట్ ఉండదని చెప్పుకొచ్చారు. అందుకే 13 పట్టణ, నగర జిల్లాల్లోకి స్పౌజ్ కేటగిరీ కింద ఇతర జిల్లాల నుంచి రాకుండా నిషేధించినట్లు సెలవిచ్చారు. నిషేధం ఎత్తివేయాలని స్పౌజ్ కేటగిరీ ఉపాధ్యాయులు నెలరోజులుగా మొత్తుకుంటున్నా ససేమిరా అన్నారు. తీరా నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు లేకుండానే.. మార్గదర్శకాలు ఇవ్వకుండానే గుట్టుగా రంగారెడ్డి జిల్లాలో 13 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. వారిలో 11 మంది ఇతర జిల్లాలవారు కావడం వివాదాస్పదం అవుతోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని, ప్రభుత్వంలోని పైస్థాయి అధికారులకు దగ్గరివారు, పైరవీలు చేసుకున్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి..
భార్యాభర్తల కేటగిరీ కింద కూడా రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వరాదని జనవరి తొలివారంలో ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 19 జిల్లాల్లో మాత్రమే ఇచ్చారు. ఒకవేళ ఆ 13 జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలనుకుంటే నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలి. ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో మార్గదర్శకాల్లో స్పష్టం చేయాలి. అయితే అవేమీ లేకుండానే రంగారెడ్డి జిల్లాలో 13 మందికి పోస్టింగ్‌లు ఇవ్వడం గమనార్హం. వారిలో ఇద్దరు ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని వికారాబాద్ జిల్లాలోని వారు కాగా... మిగిలిన 11 మంది యాదాద్రి భువనగిరి, ఖమ్మం, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల వారు కావటం గమనార్హం. మేడ్చల్ తప్ప మిగిలిన 12 జిల్లాలో 202 ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ‘ఉపాధ్యాయులకు సమాన అవకాశాలు ఇవ్వకుండా, పారదర్శకత పాటించకుండా ఈసారి ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణం’ అని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ ఆరోపించారు.