AP CM JAGAN HYDERABAD TOUR : ఏపీ ముఖ్యమంత్రి జగన్.. నేడు హైదరాబాద్ రానున్నారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.50కి గన్నవరంలో బయలుదేరి... సాయంత్రం 4.30కు శంషాబాద్ చేరుకోనున్నారు. శంషాబాద్ నుంచి ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి బయలుదేరి వెళ్తారు.
వైభవంగా సహస్రాబ్ది వేడుకలు..
సమతామూర్తి సహస్రాబ్ది సమారోహ వేడుకలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు ఉత్సవాలను అష్టాక్షరీ మంత్రం అహవనంతో ప్రారంభించిన చిన్నజీయర్ స్వామి.. జ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో భగవద్గీతలోని ఆరో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పిన సారాన్ని సమగ్రంగా యాగశాలకు వచ్చిన భక్తులకు వివరించారు. లక్ష్మీనారాయణ సహస్ర కుండల మహాయాగాన్ని అన్ని యాగశాలలకు వెళ్లి భక్తులు వీక్షించవచ్చని సూచించారు.
అహోబిలం జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఇష్టి మండపంలో దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం పరమేష్టి, పితృదేవతల విఘ్నాల నివారణ కోసం వైభవేష్టి హోమాలు నిర్వహించారు. ప్రవచన మండపంలో సుమారు 300 మంది భక్తులతో చిన్నజీయర్ స్వామి శ్రీరామ అష్టోత్తర నామ పూజ చేశారు.
ఇదీ చూడండి :Statue Of Equality at Muchintal : సమతా మూర్తి సందర్శనకు పోటెత్తిన భాగ్యనగరం