రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లో ఓ పెళ్లి జరుగుతోంది. వివాహానికి ఇరు కుటుంబాల వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరుడు, వధువు తరఫు బంధువులు పెద్ద సంఖ్యలో పెళ్లికి హాజరయ్యారు. ఫంక్షన్ హాల్ బంధుమిత్రులతో నిండిపోయింది. పెళ్లికి వచ్చే అతిథులకు అన్ని నోరురించే వంటకాలు సిద్ధం చేశారు. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకున్న సమయంలో ఉన్నట్టుండి కొంతమంది అధికారులు పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు.
ఫంక్షన్ హాల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఏం జరుగుతుందో పెళ్లికి వచ్చిన వారికి అర్థంకాలేదు. మండపంలోకి వచ్చిన అధికారులు నేరుగా పెళ్లి కూతురు దగ్గరకు వెళ్లారు. ఈ వివాహం ఆపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అసలు వచ్చినవారు ఎవరు? ఎందుకు పెళ్లి ఆపుతున్నారని బంధువులు ప్రశ్నించారు. తాము చైల్డ్ లైన్ అధికారులమని వచ్చిన ఆఫీసర్లు చెప్పారు. మీ అమ్మాయి మైనర్.. చిన్న వయసులోనే పెళ్లి చేయడం నేరం. అందుకే ఈ పెళ్లిని నిలిపివేస్తున్నామని అమ్మాయి తల్లిదండ్రులకు వివరించారు.