గోదారమ్మ ఉరకలేస్తోంది.. శరవేగంగా జలాశయాలకు చేరుతోంది. ఇప్పటికే లక్ష్మీ, పార్వతి, సరస్వతి బ్యారేజీలను దాటుకుని ఎల్లంపల్లి జలాశయం వరకు గోదావరి ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగిన విషయం విధితమే. కాళేశ్వరం రెండో లింకేజీలో కీలకంగా భావించే ప్రక్రియ దాదాపుగా సఫలీకృతమైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది పంపుహౌస్‌కు.. అటు నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్(గాయత్రి) పంపుహౌస్‌కు గోదావరి నీళ్లు చేరుతున్నాయి.
మధ్యమానేరుకు జలకళ..
గాయత్రి పంపుహౌస్ నుంచి ఈ నెల 11వ తేదీ నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న నీటి ప్రవాహంతో శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) జలాశయం జలశోభితంగా మారుతోంది. పక్షం రోజుల కిందట 3.55 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్న ఈ జలాశయంలో ఇప్పుడు సుమారు 11.28 టీఎంసీలకుపైగా వచ్చిచేరాయి. 25.87 టీఎంసీల సామర్థ్యమున్న మధ్యమానేరులో గతేడాది గరిష్ఠంగా 8 టీఎంసీల మేర నీటి మట్టం కనిపించింది. సుమారుగా 40 కి.మీ మేర ఉన్న వరద కాలువల్లో ప్రస్తుతం జలదృశ్యం ఆవిష్కృతమవుతుండటం వల్ల పరీవాహక అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
నాగుల మల్యాల చెరువు