రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని మోహినికుంట గ్రామీణ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తూ కుటుంబానికి తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. స్వశక్తి సంఘాల ద్వారా పది మంది మహిళలు సమిష్టిగా ఏర్పడి డీఆర్డీఓ సహకారంతో రూ. లక్ష రుణం తీసుకున్నారు. జూట్ బ్యాగులను తయారు చేస్తూ గ్రామంలోనే ఉపాధి పొందుతున్నారు.
జూట్ బ్యాగులు.. కేరాఫ్ ముస్తాబాద్ మహిళలు తలా కొంత.. సమిష్టి ప్రయోజనం
గ్రామంలోని ఓ మహిళా సంఘం భవనంలో రూము అద్దెకు తీసుకుని అందులో లక్ష రూపాయలతో కొనుగోలు చేసిన కుట్టు మిషన్లను ఏర్పాటు చేసుకున్నారు. మనిషికి కొంత డబ్బు వేసుకుని బ్యాగుల తయారీకి కావలసిన ముడి పదార్థాలను కొనుక్కువచ్చారు. పర్సు మాదిరిగా ఉండే జూట్ బ్యాగులను తయారు చేసి ఒకటి రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు.
మంత్రిని ఆకర్షించిన బ్యాగులు
డీఆర్డీవో సహకారంతో వీరు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మంత్రికి బ్యాగుల తయారీ గురించి వివరించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ఈ బ్యాగులు ఎంతగానో తోడ్పడతాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఇలాంటి బ్యాగుల తయారీ కేంద్రాలను జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి సూచించారు.
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పర్సు లాంటి జూట్ బ్యాగులను తయారు చేస్తూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు మోహిని కుంట గ్రామ మహిళలు.
ఇదీ చదవండి :4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం