Revanthreddy Comments At Vemulawada Meeting: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన 'హాథ్ సే హాథ్ జోడో యాత్ర' ఉత్సాహంగా కొనసాగుతోంది. వేములవాడ నియాజకవర్గంలో 21వ రోజు విజయవంతంగా సాగింది. సంకెపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర అనుపురం, నాంపల్లి, చింతల్ తానా మీదుగా వేములవాడ పట్టణానికి చేరుకుంది. రేవంత్ వెనుక కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తూ పాదయాత్రలో పుల్ జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో వేములవాడలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో తనదైన శైలిలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ ప్రతీ ఏటా రూ. 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని మాట తప్పారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. తాగు నీటి సమస్యను కూడా తీర్చలేకపోయాడని మండిపడ్డారు. 2018లో చెన్నమనేని రమేష్ ఓడిపోతాడనే భయంతో సూరమ్మ ప్రాజెక్ట్‌కు హడావుడిగా శిలాఫలకం వేశారన్న రేవంత్‌రెడ్డి... 43 వేల100 ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు. ఇన్నేళ్లయినా తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఈ ప్రాంతంపై ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన వివక్షనే.. కేసీఆర్ పాలనలోనూ కొనసాగుతోందని విమర్శించారు.
'40ఏళ్ల కింద ఇక్కడే తనకు పెళ్లి జరిగిందని... ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పిండు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదు కానీ.. వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇక్కడి ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి పోవాల్సిన ఖర్మ పట్టింది. ఈ ప్రజలపై స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ప్రేమ లేదు.. అందుకే ఇక్కడి పౌరసత్వం వదులుకున్నారు. ప్రజలతో బంధం తెంచుకున్నారు.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు