Texport Factory in Sircilla: రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పెద్దూరు గ్రామ పరిధిలోని అపారెల్ పార్కులో తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రముఖ జౌళి సంస్థ 'టెక్స్‌పోర్ట్' గ్రూప్.. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో టెక్స్‌పోర్ట్ గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. రాష్ట్ర చేనేత, జౌళి కమిషనర్ శైలజ రామయ్యార్, టెక్స్‌పోర్ట్ కంపెనీ ఎండీ నరేంద్ర గోయెంకా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
60 కోట్ల రూపాయలతో..
పెద్దూరు గ్రామ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అపారెల్ పార్కులో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. 63 ఎకరాల విస్తీర్ణంలో 175 కోట్ల రూపాయలతో ఈ పార్కును ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. వస్త్రాల ఉత్పత్తితో పాటు ఎగుమతులకు అనుగుణంగా 'బిల్ట్ టు సూట్' విధానంలో దేశంలోనే తొలిసారిగా ఈ పార్కును ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. రెడిమేడ్ దుస్తుల వ్యాపారంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన టెక్స్‌పోర్ట్ కంపెనీ.. సిరిసిల్ల అపారెల్ పార్కులో 7.42 ఎకరాల స్థలంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. రూ.60 కోట్ల వ్యయంతో జరిగే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా దాదాపు రెండు వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.