రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి రికార్డు స్థాయిలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోత కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి వస్తోన్న జలాలను గోదావరి నదిలోకి కన్నెపల్లి పంపుహౌస్ నుంచి ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డ ఆనకట్ట గేట్లన్నీ మూసివేయడం వల్ల ప్రాణహిత నుంచి వస్తోన్న ప్రతి నీటి చుక్కను ఒడిసిపడుతున్నారు. నిల్వ చేసిన జలాలను కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా తరలిస్తున్నారు. అక్కడ నిరంతరం మూడు పంపులు పనిచేస్తున్నాయి. 6,900 క్యూసెక్కుల నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. నీటి లభ్యతను బట్టి నాలుగో పంపునూ వినియోగిస్తున్నారు. శుక్రవారం నాలుగు పంపులు నీటిని ఎత్తిపోశాయి. ఐదో పంపు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధం చేశారు.
పంపుల పరీక్షలు
కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోస్తున్న జలాలు 14 కిలోమీటర్ల గురుత్వాకర్షణ కాల్వ ద్వారా ప్రయాణించి అన్నారం జలాశయానికి చేరుతున్నాయి. ప్రస్తుతం అన్నారం జలాశయంలో 2.45 టీఎంసీల నీరు నిల్వ చేశారు. అన్నారం పంపుహౌస్ ద్వారా నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సుందిళ్ల జలాశయంలో నిల్వ ఉన్న కొద్ది పాటి నీటిని పంపుల పరీక్ష కోసం అన్నారం పంపుహౌస్‌కు తరలించారు. పంపుహౌస్ ఫోర్ బే లోకి నీరు వచ్చి చేరింది. పంపుల ఎత్తిపోతకు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు వీలైనంత త్వరగా పూర్తి చేసి వారం రోజుల తర్వాత అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్నారు. ఈ నీరు సుందిళ్ల జలాశయంలోకి చేరుతుంది. ఇక్కడ నీటిమట్టం ఓ స్థాయికి చేరాక... నీటిని ఎత్తిపోస్తారు. గోలివాడ వద్ద నిర్మించిన సుందిళ్ల పంపు హౌస్‌లోని పంపులను పరీక్షించి వచ్చే నెల మొదటి వారంలో అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
5పంపుల ద్వారా ఎత్తిపోతకు సిద్ధం