ఫసల్ బీమా యోజన పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారం అందకుండా పోతోందని మానకొండూర్ నియోజకవర్గ భాజపా ఇంచార్జి గడ్డం నాగరాజు విమర్శించారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఇల్లంతకుంట మండలంలో 400 ఎకరాల వరిపంట నీటిలో మునిగిపోయిందని తెలిపారు. అనంతగిరి పోచమ్మ ఆలయం పూర్తిగా జలమయమైనా అధికారులు పట్టించుకోని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. సమస్యలను పరిష్కరించేందుకు భాజపా... రైతుల పక్షాన నిలబడుతుందని హామీ ఇచ్చారు.
‘రాష్ట్ర ప్రభుత్వం వల్లే.. రైతులకు ఫసల్ బీమా అందడం లేదు’ - పంట నష్టం
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులు ఫసల్ బీమా పథకానికి నోచుకోవడం లేదని మానకొండూర్ నియోజకవర్గ భాజపా ఇంచార్జి గడ్డం నాగరాజు ఆరోపించారు. ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి, సిరికొండ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు.
సిరికొండను ముంపు గ్రామంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి మునిగిన పంటలను అధికారులు పరిశీలించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగానికి నివేదిక సమర్పించి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 40వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల కూలిపొయిన ఇళ్లకు పరిహారంగా డబుల్ బెడ్రూం పథకంలో ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుల సమస్యల పట్ల మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో దేశెట్టి శ్రీనివాస్, మహిపాల్, ఎల్లయ్య, యాదగిరి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?