తెలంగాణ

telangana

ETV Bharat / state

దక్షిణ కాశీలో రాజన్న దర్శనానికి వేళాయే! - రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా వార్త

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం పునః దర్శనానికి సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న రాజన్న దర్శనం దక్కే సమయం ఆసన్నమైంది. కొన్ని ప్రత్యేక మార్గదర్శకాల నడుమ స్వామివారి దర్శనానికి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి మళ్లీ రాజన్న సన్నిధి భక్తులతో కళకళలాడనుంది.

rajanna darshan preparations to the devotees in  rajanna sirisilla vemulavada
కోడెమొక్కుల రాజన్న... దర్శనానికి సిద్ధం..

By

Published : Jun 7, 2020, 5:31 PM IST

Updated : Jun 7, 2020, 6:35 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 8 నుంచి భక్తులు దర్శనం చేసుకునేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌కు ముందు ఆలయంలో కనిపించిన భక్తుల రద్దీలా కాకుండా పరిమిత సంఖ్యలో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. ప్రతి గంటకు 200 మంది భక్తులను మాత్రమే దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

దక్షిణ కాశీలో రాజన్న దర్శనానికి వేళాయే!

ఆ తర్వాతే లోపలికి...

రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు ఆరోగ్యవంతంగా ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు, శానిటైజేషన్‌ చేశాకే... మాస్కులు ధరించిన వారినే దర్శనానికి పంపుతారు. అనారోగ్యంతో ఉన్నవారిని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తారు.

వారికి అనుమతి లేదు...

65 సంవత్సరాలకు పైబడిన వారిని, 10 సంవత్సరాల్లోపు చిన్నారులు, గర్భిణులను దర్శనాలకు అనుమతించరు. ఆలయంలో ఎలాంటి ఆర్జితసేవలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించరు. రాజన్న ఆలయంలో ప్రసిద్ధి గాంచిన కోడెమొక్కులను నిలిపివేశారు. కేవలం సర్వదర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులకు తీర్థ, ప్రసాద వితరణ ఉండదు.

ఆ సర్కిళ్లలోనే...

క్యూలైన్‌ కాంప్లెక్సుల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించేలా గుర్తులు గీశారు. ధర్మగుండంలో స్నానాలకు భక్తులను అనుమతించరు. తాత్కాలిక షవర్ల కింద కూడా స్నానాలు చేయడానికి లేదు. ప్రతి గంటకు ఒకసారి ఆలయంలోని క్యూలైన్లు, పరిసర ప్రాంతాలను సోడియం హైపోక్లోరైడ్‌తో శుభ్ర పరుస్తారు.

రెండు ద్వారాలు...

ఆలయంలోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణకు రెండు దారులు ద్వారా మాత్రమే అనుమతిస్తారు. భక్తులకు ప్రసాదాలు కూడా పరిమితంగానే విక్రయిస్తారు. భక్తులకు నేరుగా భోజనాలు పెట్టరు. పార్శిల్‌ రూపంలో అన్నదానం చేస్తారు. ఆలయంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఐ వెంకటేష్‌ ఆధ్వర్యంలో పరిశీలించి పలు సూచనలు చేశారు. క్యూలైన్‌ కాంప్లెక్స్‌లు, ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనాపై అవగాహన..

ఆలయ మైకుల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు వివరించనున్నారు. భక్తులు తమ పాదరక్షలను వాహనాల్లోనే వదిలిరావాలి. ఆలయంలో భక్తులు విగ్రహాలను తాకరాదు. ఆలయానికి చెందిన వసతి గదులను భక్తులకు ఇవ్వరు.

ఇదీ చూడండి:హోటళ్లు కళకళలాడాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

Last Updated : Jun 7, 2020, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details