KTR Review On Floods: భారీ వర్షాలతో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక బోర్టులు పెట్టాలని స్పష్టం చేశారు. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 666 చెరువుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని చెరువులు పటిష్ఠంగా ఉన్నాయని అధికారులు కేటీఆర్‌కు వివరించారు.
ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే 450 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారయంత్రాంగం ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీ సహా అన్ని గ్రామాల్లో భద్రతా అడిట్ జరగాలని.. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తక్షణం ఖాళీ చేయించాలని సూచించారు. ప్రమాదకార బోరుబావులు, ఓపెన్ వెల్‌లను పూడ్చివేయాలని స్పష్టం చేశారు. సిరిసిల్లలో గత జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
ప్రాణనష్టం జరగకుండా చూడండి. ఇప్పటికే చాలా వరకు శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చాం. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక బోర్టులు పెట్టాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, పంచాయతీశాఖలు పని చేయాలి.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. పనులు జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలి.