తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ - Rajanna Sirisilla Latest News

Millet Food Festival: రాజన్నసిరిసిల్ల జిల్లా అధికారులు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సరఫరా చేయడమే కాకుండా.. తాజాగా చిన్నారులకు చిరుధాన్యాలతో కూడిన ఆహారం అందించి పౌష్టికాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి జరిగే పోషణమాసంలో భాగంగా మంత్రి కేటీఆర్ సూచన మేరకు మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ చేపట్టారు.

Millet Food
Millet Food

By

Published : Sep 20, 2022, 2:32 PM IST

పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

Millet Food Festival: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల ఐసీడీఎస్​ ప్రాజెక్టు పరిధిలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 32వేల మంది పైచిలుకు చిన్నారులు నమోదు అయినట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్రాల పరిధిలో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. రోజు గుడ్డుతోపాటు మెనూ ప్రకారం ఒకపూట సంపూర్ణ భోజనం వడ్డిస్తున్నారు.

పోషకాహార లోపరహిత జిల్లాగా తీర్చిద్దిద్దేందుకు ప్రతి శనివారం చిరు ధాన్యాలతో కూడిన ఆహార పదార్ధాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పిల్లల్లో రక్తహీనత తగ్గించడమే లక్ష్యంగా పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వెయ్యి రూపాయలు సమకూర్చతున్నారు. ఈ డబ్బుతో చిరుధాన్యాలు కొనుగోలు చేసి అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు.

చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాల్లో మెండుగా పీచు పదార్థం, కాల్షియం, ఐరన్‌ ఉండటంతో చిన్నారుల్లో ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పోషణమాసంలో భాగంగా ప్రతి శనివారం చిన్నారులకు రాగి లడ్డూల అందజేయాలనే ప్రణాళిక అమలు చేస్తున్నారు. మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ సఫలీకృతమయితే కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని ఐసీడీఎస్ అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలో లభించే సజ్జలు, రాగులు, జొన్నలు, సామలు, కొర్రలు వంటి చిరుధాన్యాలు సేకరించనున్నారు. వీటితో రాగి దోశె, కొర్ర కిచిడి, మల్టీగ్రైన్‌ రొట్టెలు, సామ పెరుగన్నం, జొన్న ఉప్మా, కొర్ర పకోడి, మల్టీమిల్లెట్‌ మురుకులు, కొర్ర పులిహోరా, సామపాయసం వంటి పదార్థాలను భవిష్యత్తులో పిల్లలకు అందించనున్నట్లు తెలిపారు. నిధులు ఉన్న గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాన్ని కొనసాగించి, నిధులు లేని పంచాయతీల విషయంలో బడ్జెట్‌ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు.

ప్రతి పిల్లవాడి ఎత్తు, బరువు చూడాలని, పోషణలోపంతో బాధపడుతున్న వారిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. కేజీబీవీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, గురుకులాలు.. మోడల్‌ స్కూల్‌లు, ఇంటర్‌, హైస్కూల్‌ విద్యార్థులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నవారిని గుర్తించడమే కాకుండా, జిల్లా ఆస్పత్రి, వేములవాడ ఏరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని భావిస్తున్నారు.

పిల్లల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలపై చిన్నారుల తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోషణమాసం పూర్తయ్యేలోగా జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో.. కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు అవసరమయ్యే విత్తనాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

"32000మందికి పిల్లలకి స్ర్కీనింగ్ చేశాం. వారి బరువెంత, ఎత్తుఎంత అని తెలుసుకున్నాం. ఇప్పటి వరకూ 200 మంది పోషణలోపంతో బాధపడుతున్నారు. చిరుధాన్యాలతో తయారు చేసిన రాగి లడ్డూలు, ఇతర పదార్థాలను గ్రామపంచాయతీ, మున్సిపల్ సహకారంతో ఆ ప్రాంతంలో ఉన్న అంగన్​వాడీకి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఒక్కరికే కాకుండా గర్భిణులకు, బాలింతలకు ఇవ్వడం జరుగుతుంది." -అనురాగ్ జయంతి, జిల్లా కలెక్టర్‌

ABOUT THE AUTHOR

...view details