KTR on TSPSC paper Leak case: రాష్ట్రవ్యాప్తంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు మంత్రి కేటీఆర్, ఆయన పీఏ తిరుపతిపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లీకేజీకి తాను బాధ్యత వహించాలని, తన పీఏ తిరుపతి ఉన్నాడని.. పేపర్ అమ్ముకున్నాడని ఆధారాల్లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా?: పేపర్ లీకేజ్ కేసులో సీఎం బ్రోకర్ అని బండి సంజయ్ అన్నారని.. అదానీకి మోదీ బ్రోకర్ అని తాను చెప్పవచ్చని.. కానీ చెప్పనని కేటీఆర్ అన్నారు. జీవితంలో ఒక్కసారైనా సంజయ్, రేవంత్ పరీక్షలు రాశారా అని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి దొరికిపోలేదా అని నిలదీశారు. మల్యాల మండలంలో 415 మంది పరీక్షకు హాజరైతే.. 35 మంది మాత్రమే గ్రూప్-1 నుంచి అర్హత సాధించారని తెలిపారు. తిరుపతి స్వగ్రామంలో ముగ్గురు పరీక్ష రాస్తే.. ఒక్కరు కూడా అర్హత సాధించలేదని వివరించారు.
విపక్ష నేతలు ఇప్పుడేం చేస్తారు?: సిరిసిల్ల జిల్లాలో 3,250 మంది గ్రూప్-1 పరీక్ష రాశారని.. అందులో 255 మందికి 25 నుంచి 90 మార్కులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. జిల్లాలో ఒక్కరికి కూడా 100 మార్కులు రాలేదని పేర్కొన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అబద్దాలు ప్రచారం చేస్తున్న విపక్ష నేతలు ఇప్పుడేం చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.