రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను మంత్రి కేటీఆర్ (KTR) పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో(exgratia for manair deaths family) ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన చెక్ డ్యామ్‌లో ఈతకు వెళ్లి ఆరుగురు నీట మునిగి చనిపోయారు. విద్యార్థుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్... వారి కుటుంబాలను కలిసి ఓదార్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెక్ డ్యాం వద్ద చర్యలు తీసుకుంటామన్నారు.
ఏం జరిగిందంటే..
విద్యార్థులంతా తామూ గతంలో చదివిన తమ కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సోమవారం జరిగిన బాలల దినోత్సవంలో కలుసుకున్నారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చాక స్నేహితులతో ఆడుకుంటామని బయటకొచ్చారు. వీరంతా ఒక చోట చేరారు. అప్పుడే మానేరు వాగులోకి వెళ్దామని నాలుగు సైకిళ్లపై తొమ్మిది మంది బయలుదేరారు. వాగులోకి వచ్చాక ఈత రాకపోయినా నీటిలోకి దిగారు. ఆరుగురు ఒకేసారి నీటమునిగారు. సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్ చెక్‌డ్యాం వద్ద సోమవారం జరిగిన ఈ ఘటన ఆరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కొలిపాక గణేష్ (15), వెంకట సాయి(14), రాకేశ్ (12), క్రాంతి (14), అజయ్ (13), మనోజ్ (16) మృతి చెందారు. గణేష్ మృతదేహం సోమవారం లభ్యం కాగా, మంగళవారం నలుగురివి వెలికితీశారు. మనోజ్ మృతదేహం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బ్రిడ్జి వద్దకు కొట్టుకొచ్చిన మృతదేహాన్ని ఇవాళ వెలికి తీశారు.
ముగ్గురి సమాచారంతో...
ఆరుగురు పిల్లలు నీటిలో దిగగా.. మరో ముగ్గురు వాసాల కల్యాణ్, కోట అరవింద్, దిడ్డి అఖిల్ బయటే ఉన్నారు. తమతోటి మిత్రులు నీటిలో మునిగిపోవడంతో ఆందోళనకు గురై పరుగు పరుగున కాలనీకి వచ్చారు. వీరిచ్చిన సమాచారంతోనే కాలనీవాసులకు ప్రమాద ఘటన గురించి తెలిసింది.