KTR Comments at Sircilla Tour: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం మొత్తం కొంటామని హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడవద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఉదయం ముస్తాబాద్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కేటీఆర్.. గోపాలపల్లిలో రైతులను అడిగి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న ఆయన... దెబ్బతిన్న పంటలకు పరిహారం అందిస్తామని తెలిపారు. సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మాట్లాడిన కేటీఆర్... ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
'సీఎం కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం పేదల కోసమే. నీళ్లు ఎక్కువగా ఉన్నందునే రాష్ట్రంలో అధిక వరి సాగు. బీఆర్ఎస్ అంటే రైతు ప్రభుత్వం. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, విద్యుత్ ఇచ్చారు. ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని కర్ణాటకలో మోదీ చెప్పారు. మోదీ దేశానికి ప్రధానియా.. కర్ణాటకకు మాత్రమే ప్రధానియా ? అదానీ ఎయిర్‌పోర్టు కొనుగోలుపై జీఎస్టీ ఎందుకు ఉండదు. పేదలు కొనే పాలు, పెరుగుపై జీఎస్టీ వేసిన ఘనుడు మోదీ.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి