బతుకమ్మ చీరల తయారీ కోసం గతేడాది రూ.290 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈసారి ఆ నిధులు రూ.320కోట్లకు పెంచింది. 122 మ్యాక్స్ సొసైటీలతో పాటు సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లోని వస్త్ర పరిశ్రమలో సుమారు 17వేల మరమగ్గాలపై బతుకమ్మ చీరల తయారీ శర వేగంగా సాగుతోంది. మరమగ్గాల కార్మికులతో పాటు అనుబంధ రంగాల్లో పని చేస్తోన్న దాదాపు 30వేలకు పైగా కార్మికులకు గిట్టుబాటు కూలీ అందుతోంది. ఆసాములకు, యజమానులకు పూర్తిస్థాయిలో పని అందిస్తోంది. ఈ క్రమంలో బతుకమ్మ చీరల తయారీ నేతన్నలకు భరోసా కల్పిస్తోంది.
నవీకరణకు నిధులు
పనులు లభించక నేతన్నలు భీవండి, సూరత్ ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితుల నుంచి ఇంటి వద్ద ఉండి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న మరమగ్గాలు దాదాపు 3దశాబ్దాల క్రితం సూరత్ తదితర ప్రాంతాల నుంచి సెకండ్ హ్యాండ్‌గా కొనుగోలు చేసి తీసుకొచ్చినవే. అందువల్ల నాణ్యత గల వస్త్రాలు ఉత్పత్తి చేసే పరిస్థితి ఉండదు. మరమగ్గాల నవీకరణతో పాటు జియోట్యాగింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వారి సామర్థ్యం పెంచేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది.
పెరిగిన ఆదాయం
సిరిసిల్ల, తంగళ్లపల్లి, చంద్రంపేట ప్రాంతాల్లో దాదాపు 25వేలకుపైగా మరమగ్గాలు కుటీర పరిశ్రమలుగా నడుస్తున్నాయి. గతంలో కార్మికుడు 12గంటలు పనిచేసినా నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల కూలీ లభించేది. ప్రస్తుతం బతుకమ్మ చీరల కారణంగా కూలీ నెలకు రూ.16నుంచి రూ.18వేల వరకు అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వస్త్ర ఉత్పత్తిలో ఎక్కడ నాణ్యతకు రాజీపడటం లేదు... చేనేత జౌళిశాఖ. రోజు ఇద్దరు అధికారులు నాణ్యత పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.