తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆక్సీజన్‌కు గమ్యం...హరితం

హరితహారంలో మొక్కల పెంపకానికి రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో చర్యలు చేపడుతున్నారు. గాలిలో ఆక్సీజన్‌ అందుబాటు 19.5 శాతంకన్నా తగ్గకుండా ఉండాలంటే చెట్లు కనీసం 33 శాతం ఉండాలి.

ఆక్సీజన్‌కు గమ్యం...హరితం

By

Published : Jul 4, 2019, 1:55 PM IST

ఆక్సీజన్‌కు గమ్యం...హరితం

ఉమ్మడి జిల్లాలో 2.50 లక్షల హెక్టార్ల అటవీభూమి ఉండగా ఇందులో 33వేలు హెక్టార్ల వరకు భూమిలోని చెట్లు నరికివేతకు గురయ్యాయి. హెక్టారుకు కనీసం 500 వరకు చెట్లు పెంచాల్సిన అవసరం ఉండగా 33వేల హెక్టార్ల అటవీభూమితో పాటుగా ఇతరత్రా స్థలాల్లోనూ కనీసం 165 కోట్లకుపైగా మొక్కలను నాటి చెట్లుగా పెంచాల్సిఉంది. జిల్లాలో 34 లక్షల వరకు జనాభా ఉండగా ప్రస్తుతం ఉన్న చెట్లు ఆక్సీజన్‌ వరకు సరిపోతున్నా వాతావరణాన్ని చల్లబరచటం, వర్షాలను కురిపించేలా చేయలేకపోతున్నాయి. ఒక ఎకరం విస్తీర్ణంలో పెరిగిన చెట్లు సంవత్సరం పాటు 18 మందికి ఆక్సీజన్‌ను అందించగలుగుతాయి కాబట్టి విరివిగా చెట్లను పెంచాల్సి ఉంది.

ఉపయోగాలు

  • ఒక తుమ్మచెట్టు సాలీనా 330 పౌండ్ల కార్బన్‌డైఆక్సైడ్‌ను, చింత, వేపచెట్లు 59 పౌండ్ల కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహించి మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఒక ఎకరం విస్తీర్ణంలో పెరిగిన చెట్లు సంవత్సరం పాటు 18 మందికి ఆక్సిజన్‌ను అందించగలుగుతాయి. ఒక కారు 26 వేల మైళ్లు తిరిగితే వెలువడే కార్బన్‌డైఆక్సైడ్‌ను ఎకరంలోని చెట్లు పీల్చుకుని మంచిగాలిని విడుదల చేస్తాయి.
  • కార్బన్‌డైఆక్సైడ్‌, అమోనియా, సల్ఫర్‌ ఆక్సైడ్‌, ఓజోన్‌3 తదితర హానికర వాయువులు గ్రీన్‌హౌజ్‌లో కలవకుండా చెట్లు వీటిని అడ్డుకుంటాయి. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు రహదారులు, నేల, భవనాలపై పడకుండా అడ్డుకుని భూమి వేడెక్కడాన్ని తగ్గిస్తాయి. ఒక చెట్టు వానానికి 15 గ్యాలన్ల నీటిని తీసుకుని పరిసరాల్లోని గాలిలోకి తగినంత తేమను విడుదల చేస్తుంది.
  • పైర్లపై ఆశించే చీడపీడల్లో 200 వైరస్‌, బ్యాక్టీరియా కారకాలను ఒక్క వేపచెట్టు నాశనంచేస్తుంది. సబ్బులు, ఔషధాలు, మందులు, అలంకార తయారీల్లో చెట్లనుంచి వెలువడిన ఉత్పత్తులే ఆధారం.

చెట్లతోనే మనుగడ

  • ఉమ్మడి జిల్లాలో 6.10 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగాఉంది. ప్రైవేటు నర్సరీలనుంచి మొక్కలను కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వ హరితహారం కార్యక్రమం ద్వారా పండ్లు, పూలు, ఔషధమొక్కలను సరఫరా చేస్తున్నందున ప్రజలు వీటిని కూడా తీసుకోవచ్చు.
  • ఇళ్లు, పంటపొలాలు, ఇతరత్రా స్థలం ఎక్కువున్నవారు మామిడి, సీతాఫలం, జామ, ఉసిరి, వాటర్‌ఆపిల్‌, తెలంగాణ ఆపిల్‌, బత్తాయి, దానిమ్మ తదితర పండ్లమొక్కలను, వేప, అలక్టోనియా, కదంబ, కానుగ తదితర నీడనిచ్చే మొక్కలను కూడా నాటుకోవచ్చు. కేవలం నాటడంతో సరిపెట్టకుండా హరితహారం మొక్కలన్నీ పరిరక్షిస్తేనే దీర్ఘకాలికంగా సత్ఫలితాలు సాధ్యపడతాయి.

చెట్లు పెరిగేలా చర్యలు
నాటిన మొక్కలన్నీ చెట్లుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలి. చెట్ల ఆకుల్లోని పచ్చదనం వేడిగాలులను, హానికర వాయువులను పీల్చుకుని ఆక్సీజన్‌ను విడుదల చేస్తాయి. వివిధ సమయాల్లో కిరణజన్య సంయోగక్రియను నిర్వహించుకునే చెట్లు హానికర వాయువులను గ్రహిస్తాయి. అన్ని సమస్యల పరిష్కారానికి చెట్లే పరిష్కారమన్న విషయాన్ని అందరూ గ్రహించాలని వాతావరణ శాస్త్రవేత్త ఎన్‌.నవత పేర్కొన్నారు.

ప్లాస్టిక్‌, పాతబకెట్లలో మొక్కలు
చెట్లున్న ప్రాంతాల్లో తేమ పరిరక్షింపబడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లు ఎంతగానో దోహదంచేస్తాయని శాస్త్రవేత్త పి.సాద్విరెడ్డి తెలిపారు. ఇళ్లలోనూ, వసారాల్లోనూ మనగలిగే మొక్కలను పెంచటం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి. అవకాశముంటే నేలపై లేదా ప్లాస్టిక్‌, సిమెంట్‌ కుండీల్లో, పాతబకెట్లు, రంజన్లలో మొక్కలను పెంచవచ్చు.

ఇదీ చూడండి : 'వరంగల్​ కామాంధుడిని ఉరితీయాలి'

ABOUT THE AUTHOR

...view details