తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీపై కరోనా దెబ్బ

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఆర్టీసీకి భారీగా నష్టం మిగిల్చింది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ డిపోలు రూ.కోట్లల్లో నష్టాలను మూటగట్టుకున్నాయి. లాక్‌డౌన్‌తో జిల్లాలోని రెండు డిపోల్లోని బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ఉద్యోగులు 30 శాతం మంది రెండు రోజులుగా విధులకు హాజరవుతుండటం గమనార్హం.

corona and lock down effect on telangana rtc
ఆర్టీసీపై కరోనా దెబ్బ

By

Published : May 12, 2020, 9:38 AM IST

కరోనా దెబ్బతో ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలోని రెండు డిపోల్లోని 133 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. లాక్‌డౌన్‌ మొదలై 50 రోజులు గడుస్తోంది. ఫలితంగా రెండు డిపోలకు రూ.8.95 కోట్ల నష్టం వాటిల్లింది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం మార్చి 22న లాక్‌డౌన్‌ విధించింది. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాక్‌డౌన్‌ కొనసాగడంతో ఆయా డిపోల్లోని బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిపో లాక్‌డౌన్‌కు ముందు రూ.75 లక్షల లాభాల్లో ఉండేది. అలాంటి డిపో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా రూ.4.29 కోట్ల నష్టానికి చేరుకుంది. ఈ డిపోలో 37 ఆర్టీసీ, మరో 26 అద్దె బస్సులు ఉన్నాయి. రోజూ సరాసరి రూ.8.5 లక్షల ఆదాయం డిపోకు సమకూరేది. సిరిసిల్ల డిపోలో మొత్తం 70 బస్సులున్నాయి.

ఈ బస్సుల ద్వారా డిపోకు రోజూ సుమారు రూ.9.5 లక్షల ఆదాయం సమకూరేది. లాక్‌డౌన్‌తో సిరిసిల్ల డిపోకు దాదాపు రూ. 4.66 కోట్ల మేర నష్టం వాటిల్లింది. జిల్లాలోని ఈ రెండు డిపోల నుంచి జిల్లాలోని వివిధ గ్రామాలతో పాటు, ఇతర జిల్లాలకు బస్సులు తిరుగుతుంటాయి. ఆర్టీసీ బస్సులు నడపకపోయినా రెండు రోజులుగా 30 శాతం మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు.

లాభాల నుంచి నష్టాల వైపు...

వేములవాడ ఆర్టీసీ డిపో కరోనా దెబ్బతో లాభాలతో ఉన్న డిపో మరోసారి నష్టాలను మూటగట్టుకుంది. వేములవాడ ఆర్టీసీ డిపో గతంలో నష్టాల్లో ఉండేది. అయితే డిపో అధికారులు, సిబ్బంది పకడ్బందీ ప్రణాళికతో బస్సులను నడిపించి నష్టాల్లో మూలుగుతున్న డిపోను లాభాల బాట పట్టించారు.

ముఖ్యంగా వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి మొక్కులు చెల్లించుకునేందుకు రావడంతో డిపోకు ఆదాయం అధికంగా సమకూరేంది. లాక్‌డౌన్‌కు ముందు డిపో రూ.75 లక్షల లాభాల్లో ఉంది. నష్టాల నుంచి బయటపడిన డిపో కరోనా పుణ్యమాని మళ్లీ నష్టాలోకి వెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details