తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay Pada Yatra :2023 ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం: బండి సంజయ్‌ - గంభీరావుపేటలో ప్రజా సంగ్రామ యాత్ర

ప్రజా సంగ్రామ యాత్రకు తరలి వస్తున్న కార్యకర్తలపై కేసులు పెడితే సహించేది లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BANDI SANJAY) హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా(rajanna sircilla dist) గంభీరావుపేటలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో(praja sangrama yatra) ఆయన మాట్లాడారు. జిల్లాలో తెరాస చేసిన అభివృద్ధి ఎంటో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

BJP state president bandi sanjay
గంభీరావుపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

By

Published : Sep 23, 2021, 8:31 PM IST

Updated : Sep 23, 2021, 9:20 PM IST

రుణమాఫీ, రెండు పడక గదుల ఇవ్వకుండా తెరాస ప్రభుత్వం మోసం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BANDI SANJAY) విమర్శించారు. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా(rajanna sircilla dist) గంభీరావుపేటలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో (praja sangrama yatra) ఆయన మాట్లాడారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులే సమాధానం చెప్పాలన్నారు. గట్టిగా వర్షం పడితే సిరిసిల్ల మునిగిపోయేంత అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం 2 లక్షల 91 వేల ఇళ్లు ఇస్తే.. జిల్లాలో కనీసం 12 వేల ఇళ్లను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి అడుగుపెట్టడంతో నా సొంతగడ్డకు వచ్చినట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

గంభీరావుపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం

రానున్న 2023 ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగర వేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో ముగించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకున్న సందర్బంగా భాజపా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా నర్మల గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు 290 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుని పరిహారం ఇవ్వలేదని ఆయనకు వినతి పత్రం అందజేశారు. నిర్వాసితులు అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నర్మాల నుంచి గంభీరావుపేట, లింగన్నపేట వరకు 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.

కేసులు పెడితే ఊరుకోం

సిరిసిల్ల జిల్లాలో భాజపా కార్యకర్తలపై పోలీసులు అనవసర కేసులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. భాజపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఎట్టి పరిస్థతుల్లో ఊరుకునేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా కార్యకర్తలు కేసులకు భయపడే వారు కాదన్నారు. ప్రతి ఒక్కరూ కేసులకు భయపడకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. పోలీసులు అలానే వ్యవహరిస్తే తానే స్టేషన్​కు వస్తానని హెచ్చరించారు.

సర్పంచుల పరిస్థితి దారుణం

తెరాస పాలనలో సర్పంచులు ఆస్తులను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని.. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​లో 20 మంది సర్పంచులు రాజీనామా చేయడమే ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గంభీరావుపేట మండలంలో బస్సు నీటిలో కొట్టుకుపోతే.. వంతెన కట్టలేని మంత్రి భాజపాను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో హిందూ పండుగలకు అనుమతులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 370 ఆర్టికల్ రద్దు బిల్లులో నన్ను పాల్గొనేలా చేసిన జిల్లా ప్రజలందరికీ రుణపడి ఉంటానని బండి సంజయ్ అన్నారు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీరు గెలిపిస్తేనే రాష్ట్రానికి అధ్యక్షుడినయ్యా

మీరు ఎంపీగా గెలిపిస్తేనే నేను రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యానని బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్​లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామపంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమైతే ఇస్తామన్న పైసలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గంలో 20 మంది సర్పంచులు రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్నారన్నారు. రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. వైకుంఠధామాలు కట్టింది మేమైతే వాటికి గులాబీ రంగులేస్తున్నారని మండిపడ్డారు. వరి వేస్తే ఉరేనని ఏ ముఖ్యమంత్రి అయిన అంటాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించే ప్రతి గింజ నేను కొంటానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు కేంద్రం కొనుగోలు చేయడం లేదని అంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా దొడ్డు బియ్యం కొనుగోలు చేయాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

అక్టోబర్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దళిత్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రం కోసం వందల మంది ప్రాణత్యాగం చేస్తే ఒక్క కుటుంబమే పెత్తనం చెలాయిస్తోందని విమర్శించారు. పెట్రోల్​, డీజిల్​లో లీటర్​కు 40 రూపాయలు వాటా తీసుకుంటూ ఇప్పుడు ఆర్టీసీ ధరలు పెంచుతామంటున్నారు. రాష్ట్ర జీడీపీ పెరిగిందంటున్న ప్రభుత్వం ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్, ఆర్టీసీ ధరలు పెంచితే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం రావాలంటే ఉద్యమాల గడ్డ అయినా సిరిసిల్ల నుంచే మొదలు కావాలన్నారు. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజి పనులు కాకముందే ఫామ్ హౌస్​కు నీళ్లు తీసుకుపోయేందుకు పదో ప్యాకేజి కట్టారని ఆరోపించారు.

రుణమాఫీ ఇయ్యలే. డబుల్ బెడ్ రూములు ఇవ్వలే. కనీసం 12 వేల ఇళ్లను ఇవ్వలేదు. మీ జిల్లాకు కేంద్రం తరఫున 2 లక్షల 91 వేల ఇళ్లు ఇచ్చాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు దళితబంధును ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలి. అక్టోబర్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తాం. దళితబంధు అన్ని నియోజకవర్గాల్లో ఇవ్వాల్సిందే. సిరిసిల్లలో జిల్లాలో అనేక మంది చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కులాల వారీగా బంధులు ఎందుకివ్వరో సమాధానం చెప్పాలి. తాతా, ముత్తాతల భూముల్లో పంటలు పండిస్తే చేతికొచ్చిన పంటను అటవీ శాఖను అధికారులు వచ్చి అడ్డుకుంటున్నరు. రాష్ట్రంలో హిందువులు పండుగలు చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న తమ్ముళ్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. నన్ను ఎంపీగా గెలిపించిన మీ అందరికీ శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి:Bandi sanjay : 'నిజాలు మాట్లాడితే.. విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?'

Last Updated : Sep 23, 2021, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details