Vemulawada Rajanna temple : ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధానం... మహా జాతరకు ముస్తాబైంది. వేములవాడ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి సందడి కనిపిస్తోంది. శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు.... గుడికి వెళ్లే దారులన్నింటిని... విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. దారి వెంట ప్రత్యేక అలంకరణలు, స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న జాతరను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. సిరిసిల్ల వైపు నుంచి వేములవాడకు వచ్చే మార్గంతో పాటు కరీంనగర్ మార్గంలో ప్రత్యేక అలంకరణ చేపట్టారు. గుడి చెరువులో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమ నిర్వహణకు వేదిక సిద్ధం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 3 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు.
ఆలయ పరిసరాల్లో ప్రత్యేక నిఘా
కరోనా కారణంగా ధర్మగుండం మూసివేయగా... ప్రత్యేకంగా జల్లు స్నానాల నల్లాలు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించనున్నారు. ఆలయ పరిసరాలతో పాటు... నాంపల్లి గుట్టపై వేములవాడలోని వివిధ కూడళ్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు.
రేపు ప్రత్యేక పూజలు
వేములవాడలో అర్ధరాత్రి నుంచి ఉదయం 3గంటల వరకు సర్వ దర్శనం... రేపు ఉదయం 4 గంటలకు సుప్రభాతసేవ నిర్వహించనున్నారు. 7 గంటలకు తితిదే తరఫున, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన ఉంటుంది. రాత్రి పదకొండున్నర నుంచి లింగోధ్బవ సమయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉంటుందని ప్రధాన అర్చకులు తెలిపారు.