పెద్దపల్లి జిల్లాలోని 14 గ్రామాల్లో రెండు మండలాలైన సుల్తానాబాద్, రామగిరి మండలాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రభావిత బావులు ఉండటం మూలంగా వీటిని మినహాయించి మిగిలిన 12 మండలాల్లో భూగర్భ నీటి నిల్వలను అధికారులు ప్రామాణికంగా లెక్కిస్తారు. ఇందులో మంథని, రామగుండం మండలాల్లో భూగర్భ నీటి వనరులు ఏటికేడు తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా మంథని మండలంలోని ఐదు గ్రామాలైన ఎగ్లాస్‌పూర్, స్వర్ణపల్లి, నాగేపల్లి, మల్లారం, వెంకటాపూర్ గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోవడం మూలంగా సాగు, తాగు నీటి లభ్యతకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భూగర్భజల శాఖ అధికారులు ఈ గ్రామాల్లో ‘వాల్టా’ అమలు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో నీటి వనరుల కోసం బోర్లు తవ్వడం, ఇసుక తరలింపుపై సర్కార్ ఆంక్షలు విధించింది. లాక్‌డౌన్ కారణంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది జలవనరుల తగ్గుదలలో మార్పులు లేవు.
రామగుండంలో భారీ పరిశ్రమలైన ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ, తెలంగాణ ఎస్టీపీపీ, సింగరేణి, సిమెంట్ పరిశ్రమల్లో నీటి వినియోగం తగ్గిపోవడం మూలంగా కొంత వరకు భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలోనే ఉన్నాయి. మంథనిలో ఇసుక అక్రమ తరలింపు ఎక్కువగా జరగడం మూలంగా నీటి నిల్వల నిష్పత్తులు తగ్గిపోయాయి.