తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు పింఛన్ల కోత.. దంపతుల్లో ఒక్కరికే ‘ఆసరా’

ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ‘ఆసరా’ పింఛన్లు తీసుకుంటున్నట్లయితే వారిలో భర్త పింఛనును రద్దు చేసి భార్యకు కొనసాగించనున్నారు. ఆధార్‌ కార్డుల ఆధారంగా పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ఇలా ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పింఛన్లు పొందుతున్న వైనాన్ని గుర్తించి బల్దియాలకు పంపించారు. రామగుండం నగరపాలక ప్రాంతంలో 126 మందిని గుర్తించారు.

రెండు పింఛన్ల కోత.. దంపతుల్లో ఒక్కరికే ‘ఆసరా’
రెండు పింఛన్ల కోత.. దంపతుల్లో ఒక్కరికే ‘ఆసరా’

By

Published : Jul 23, 2020, 5:53 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లో 126 ఇళ్లల్లో భార్యాభర్తలిద్దరూ పింఛన్లు పొందుతున్నారు. వీరిలో భర్తది రద్దు చేసి భార్య పింఛను మాత్రం కొనసాగించనున్నారు. ఇప్పటికే ఇద్దరిలో ఒకరు మృతి చెందినట్లయితే చనిపోయిన వారి పింఛను రద్దు చేసి జీవించి ఉన్నవారి పింఛనును యథావిధిగా కొనసాగించనున్నారు.

నగరపాలక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా కొందరు మృతి చెందినప్పటికీ రెండు, మూడునెలలుగా పింఛన్లు యథావిధిగా వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నట్లుగా గుర్తించారు. మొదటి దశలో డబుల్‌ పింఛన్లలో ఒకరికి రద్దు చేసి మరొకరి పింఛనును కొనసాగించనున్నప్పటికీ ఆ తర్వాత డబుల్‌ పింఛన్లు పొందిన వారి నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఏడాదిగా ఎదురు చూపులు

ఏడాది క్రితం వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదించారు. దీంతో అర్హులయిన అనేక మంది ‘ఆసరా’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వెబ్‌సైట్‌లో సవరణ చేయకపోవడం వల్ల వీటిని నమోదు చేయకుండానే నగరపాలక కార్యాలయంలో భద్రపరిచారు. దీంతో ఏడాదిగా 57 సంవత్సరాలకు పైబడిన వారు ‘ఆసరా’ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. సకలజనుల సర్వే ఆధారంగా రామగుండం నగరపాలక ప్రాంతంలో 57 సంవత్సరాల వయసు నిండిన వారు 11,700 మంది ఉన్నట్లుగా గుర్తించారు.

నగరపాలక అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయగా ఇందులో కొందరు ‘ఆసరా’కు అర్హులు కాకపోగా కొందరు ఇప్పటికే దివ్యాంగులు, వితంతు పింఛన్లు పొందుతున్నారు. మొత్తం మీద 3,400 మంది మాత్రమే వృద్ధాప్య పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. నగరపాలక అధికారులు వీరి వివరాలను తీసుకోవడంతో పాటు వారు నగరపాలక కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు వీటికి మోక్షం లేదు. కొత్తగా సుమారు 700 మంది 65 సంవత్సరాలకు పైబడిన వృద్ధులతో పాటు దివ్యాంగులు, వితంతులు పింఛన్ల కోసం ధరఖాస్తు చేసుకోగా పది నెలలుగా మంజూరు లేదు.

ఇదీ చూడండి:తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details