తెలంగాణ

telangana

By

Published : May 17, 2020, 9:01 AM IST

ETV Bharat / state

బొగ్గు రంగానికి ఉద్దీపన

విదేశీ బొగ్గు దిగుమతిని నియంత్రించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపన పథకం బొగ్గు పరిశ్రమ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. 500 బొగ్గు బ్లాకుల కేటాయింపునకు వేలం వేయాలని కేంద్ర మంత్రి నిర్ణయించడంతో సింగరేణి కొత్త గనులు దక్కించుకునే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ఒడిశాలో రెండు బ్లాకులను దక్కించుకున్న సంస్థ ఇతర రాష్ట్రాల్లోనూ అడుగు మోపేందుకు ప్రయత్నిస్తోంది.

telangana singareni get benefited from central athma nirbhar bharat package
బొగ్గు రంగానికి ఉద్దీపన

బొగ్గు రవాణాలో సింగరేణి మరిన్ని ప్రోత్సాహకాలు దక్కించుకునే అవకాశం ఉంది. దేశంలోనే ఏ బొగ్గు పరిశ్రమలో లేని విధంగా వినియోగదారులతో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకుని సకాలంలో రవాణా చేస్తోంది. సకాలంలో బొగ్గు రవాణా చేసిన సంస్థలకు ప్రోత్సాహకాలు అందజేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించడం సింగరేణికి మరింత కలిసొచ్చే అంశం. ఏటా 60 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా చేస్తున్న సింగరేణి వినియోగదారులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పరిమాణం, సమయాలను కచ్చితంగా పాటిస్తోంది.

కొత్త బ్లాకుల విస్తరణకు అవకాశం

సింగరేణి కొత్త బ్లాకులు విస్తరించుకునేందుకు అవకాశం ఏర్పడింది. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 9 కొత్త బ్లాకులను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అన్వేషణ పనులు ముగించారు. బొగ్గు నిక్షేపాలున్నట్లు నిర్ధారించినా ఉత్పత్తి చేపట్టేందుకు కేంద్రం అనుమతులు రావాల్సి ఉంది. కేంద్ర మంత్రి ప్రకటించిన 500 బ్లాకుల్లో సింగరేణి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నవి కూడా ఉన్నాయి. దీంతో వాటికి సాధ్యమైనంత తొందరగా అనుమతులు లభించే అవకాశం ఉంది.

ఇక రవాణా సులభం

రైల్వే మార్గాలు లేక సింగరేణి బొగ్గును రహదారి మార్గంలో రవాణా చేస్తోంది. స్వదేశీ పరిశ్రమను అభివృద్ధి చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గును నిలువరించేందుకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన పథకాలు పరిశ్రమకు తోడ్పాటునందించనున్నాయి. ప్రస్తుతం దేశంలో 150 మిలియన్‌ టన్నుల బొగ్గు కొరత ఉండటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పరిశ్రమ ఉన్న ప్రాంతాలకు రైలు మార్గాలను విస్తరించాలని నిర్ణయించారు.

సింగరేణి సంస్థ ప్రస్తుతం సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. జైపూర్‌ విద్యుత్తు కేంద్రం నుంచి మంచిర్యాల వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంది. భూపాలపల్లి నుంచి జమ్మికుంట వరకు రైలు మార్గం కోసం ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు పురోగతి లేదు. కేంద్ర మంత్రి ప్రకటించిన వసతుల ద్వారా ఈ మార్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.

తెరపైకి బొగ్గు వాయువు

కేంద్ర మంత్రి ప్రకటించిన బొగ్గు వాయువు విధానం సింగరేణిలో ఇదివరకే ప్రయత్నించారు. సంస్థ బొగ్గు వాయువు కోసం ప్రణాళికలు వేయడంతో పాటు కోల్‌ కెమికల్‌ కాంప్లెక్స్‌ను చాలా ఏళ్ల కిందటే ఏర్పాటు చేసింది. ఇక కోల్‌ గ్యాసిఫికేషన్‌ కోసం కూడా ప్రణాళికలు వేసి ప్రయోగాత్మకంగా ఒకటి రెండు గనుల్లోంచి బొగ్గు వాయువును వెలికితీసేందుకు ప్రయత్నించింది. భూగర్భంలోనే బొగ్గు పొరలకు రంధ్రాలు వేసి అందులోంచి వాయువును మాత్రమే సరఫరా చేసి విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు సరఫరా చేయాలని ప్రణాళికలు వేశారు. ఇందుకోసం పిట్‌ హెడ్‌ విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు.

ABOUT THE AUTHOR

...view details