తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

రాష్ట్రావతరణ దినోత్సవాన వెలుగులు పంచే సింగరేణిలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీ-2 రీజియన్ సెంటినరీ కాలనీ ఉపరితల గనిలో పేలుడుకు నలుగురు కార్మికులు బలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా... ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధ్యులపైన చర్యలకు డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

పేలిన బతుకులు..రామగుండం సింగరేణిలో ఘోర గని ప్రమాదం
పేలిన బతుకులు..రామగుండం సింగరేణిలో ఘోర గని ప్రమాదం

By

Published : Jun 2, 2020, 9:14 PM IST

సింగరేణి గనుల్లో చోటు చేసుకున్న ప్రమాదం నలుగురు కార్మికులను కబళించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సెంటినరీ కాలనీ ఉపరితల గనిలో జరిగిన పేలుడులో నలుగురు ఒప్పంద ఉద్యోగులు దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రుడ్ని హైదరాబాద్ తరలించారు.

ఓబీ నిర్వహణలో లోపం..

బొగ్గు ఉత్పత్తి చేసే ముందు మట్టి తొలగించే (ఓబీ) ఓవర్ బర్డన్ పనులను... సింగరేణి గుత్తేదారుకు అప్పగిస్తుంది. ఈ క్రమంలో మట్టి తొలగించేందుకు పేలుడు నిర్వహిస్తుండగా మిస్‌ఫైర్ అయ్యింది. ఫలితంగా దుర్ఘటన చోటు చేసుకుంది. ఏడుగురు ఒప్పంద కార్మికుల్లో నలుగురు మట్టిలో కూరుకుపోయి ఘటనా స్థలిలోనే చనిపోయారు. మృతదేహాలను గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.

కఠిన చర్యలు తీసుకోవాలి...

రామగుండం పేలుడు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వపరంగా కార్మికుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మానవ తప్పిదమా... లేక సాంకేతిక లోపమా?

పేలుడు జరిగిన ప్రాంతంలో రామగుండం సీపీ సత్యనారాయణ విచారణ జరిపారు. మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఆరా తీశారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్రావతరణ వేడుకల వేళ సింగరేణిలో ప్రమాదం కార్మిక లోకాన్ని తీవ్రంగా కలచివేసింది.

పేలిన బతుకులు..రామగుండం సింగరేణిలో ఘోర గని ప్రమాదం

ఇవీ చూడండి : 'గనిలో పేలుడు మానవ తప్పిదమా.. సాంకేతిక లోపమా?'

ABOUT THE AUTHOR

...view details