రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని నిరుపేదలకు విజయమ్మ ఫౌండేషన్ భరోసాగా నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో 979 మంది దివ్యాంగులకు ఉచిత బస్ పాస్‌లను ఆయన అందజేశారు. రాష్ట్రంలోని నిరుపేదల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. దివ్యాంగులకు రూ.3 వేల పింఛను అందించి వారికి ఆర్థికంగా భరోసానిస్తున్నారన్నారు.
రామగుండంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు తమ వేతనం నుంచి ఈ ఫౌండేషన్ ద్వారా 25 శాతం ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన పనులు, దివ్యాంగులు చిరువ్యాపారాలు చేపడితే వారిని ఆర్థికంగా ఆదుకోవడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా వారికి కావాల్సిన సదుపాయలు అందిస్తామన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సదరన్ క్యాంపుని త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.