తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ రైతుకు ఎరువుల సంక్రాంతి - రామగుండం ఎరువుల కర్మాగారం

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారం ప్రారంభానికి సిద్ధమైంది. జనవరి 15న... రైతులకు సంక్రాంతి కానుకగా తయారీ ప్రక్రియ ఆరంభించేందుకు యాజమాన్యం సన్నద్ధమవుతోంది. ఏటా 13 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమ శాఖ నుంచి నిర్వహణ అనుమతులు ఇప్పటికే లభించగా... తయారీ, విక్రయాలకు వ్యవసాయశాఖ అనుమతులు రావాల్సి ఉంది.

ramagundam fertilizers company ready to launch on sankranthi
తెలంగాణ రైతుకు ఎరువుల సంక్రాంతి

By

Published : Dec 27, 2020, 6:46 AM IST

తెలంగాణ సిగలో మరో కలికితురాయిగా మారనున్న రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో జనవరి 15న ఉత్పత్తి ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నద్ధమవుతోంది. రూ.6,120.5 కోట్ల వ్యయంతో నిర్మించిన పరిశ్రమలో ఏటా 13 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయలనేది లక్ష్యం. ఇప్పటికే దీనికి పరిశ్రమల శాఖ నుంచి నిర్వహణ అనుమతులు లభించాయి. ఎరువుల ఉత్పత్తి, విక్రయాలకు సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే తయారీ ప్రక్రియను ఆరంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

తెలంగాణ రైతుకు ఎరువుల సంక్రాంతి

దిగుమతులు తగ్గించే లక్ష్యంతో

దేశంలో ఏటా 300 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను వినియోగిస్తుండగా 240 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 60 లక్షల మెట్రిక్‌ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో మొదటిగా తెలంగాణలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సిద్ధమైంది. కరోనా కారణంగా రాజస్థాన్‌, ఒడిశాలకు చెందిన వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కర్మాగారంలో పనులు చివరి దశలో నిలిచిపోయాయి. కర్మాగారంలో యూరియా స్టోరేజీ ట్యాంకుల అమరిక పనులూ అయిపోయాయి. అమ్మోనియా కన్వర్టర్లు, యూరియా రియాక్టర్లనూ అమర్చారు. పరిశ్రమ భద్రతకు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని కేటాయించడంతోపాటు, వారికి నివాస గృహాలనూ నిర్మిస్తున్నారు. ‘అమ్మోనియా ట్యాంకుల విడి భాగాల బిగింపు, అదనపు సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు 99 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇతర దేశాల నుంచి రవాణాపరమైన సమస్యలు తలెత్తడంతో ఉత్పత్తికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని’ అధికారులు చెబుతున్నారు.

నిరంతర సమీక్షలతో పనుల్లో వేగం

సీఎం కేసీఆర్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత తదితరులు పనుల పురగతిని సమీక్షిస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబరు 12న కేంద్ర ఎరువుల శాఖ సహాయమంత్రి మాన్‌సుఖ్‌మాండవ్యా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కర్మాగారాన్ని సందర్శించారు. నవంబరులోగా పనులు పూర్తిచేయాలని గడువు నిర్దేశించగా, డిసెంబరు రెండోవారం నాటికి పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు. చివరికి జనవరి 15న కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై అధికారికంగా ప్రకటించలేదు.

1970లో మొదలై..ఎన్నో మార్పులతో

* 1970లో బొగ్గు ఆధారిత యూరియా తయారీ పరిశ్రమను కేంద్రం ఏర్పాటుచేసింది. 1980లో 4.95లక్షల టన్నుల యూరియా, 2.97లక్షల టన్నుల అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంతో కర్మాగారాన్ని నిర్మించింది. 1985 వరకు ఉత్పత్తిలో గుర్తింపు పొందిన పరిశ్రమను తదనంతరం 1999లో మూసివేశారు.

* కర్మాగారం పునరుద్ధరణకు కేంద్రం ఎన్‌ఎఫ్‌ఎల్‌, ఐఈఎల్‌, ఎఫ్‌సీఐఎల్‌లతో కలిసి ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పేరిట భాగస్వామ్య సంస్థను ఏర్పాటుచేసింది. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ పనులకు శంకుస్థాపనచేశారు. 2015లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా నామకరణం చేయగా 2016లో పనులు ప్రారంభమయ్యాయి.

* పరిశ్రమలో ముందస్తుగా మూడు భారీ వాహనాలతో అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించారు.

నాడు బొగ్గు..నేడు సహజవాయువు

రామగుండంలో మూతపడిన ఎఫ్‌సీఐ కర్మాగారం బొగ్గు, విద్యుత్తు ఆధారంగా నడిచేది. కొత్త పరిశ్రమలో సహజవాయువును ఇంధనంగా వినియోగించనున్నారు. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మల్లవరం నుంచి రాజస్థాన్‌కు వెళ్లే గ్యాస్‌ పైప్‌లైనుతో రామగుండంలోని గ్యాస్‌ పైప్‌లైన్లను అనుసంధానించారు.

విదేశీ సాంకేతికతతో

ఇక్కడ అమ్మోనియాను డెన్మార్క్‌ దేశానికి చెందిన హల్డోర్‌, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్‌పేమ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేయనున్నారు. గ్యాస్‌ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేయడం, ఆ నీటి ఆవిరినే యూరియా, అమ్మోనియా ఉత్పత్తి కోసం వినియోగించడం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రత్యేకతల్లో ఒకటని అధికారులు తెలిపారు.

ఎల్లంపల్లి నుంచి నీటి కేటాయింపులు

కర్మాగారానికి ఏటా ఒక టీఎంసీ నీరు అవసరం కాగా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌ నుంచి కేటాయించారు. ఇందుకు సంబంధించి పైపులైను పనులు పూర్తయ్యాయి. ఈ పరిశ్రమలోనే నీటి అవసరాలకు చిన్నపాటి రిజర్వాయరునూ నిర్మించారు.

తయారీ.. కేటాయింపులు ఇలా

ప్లాంటు విస్తీర్ణం: 1,000 ఎకరాలు

ఏటా తయారయ్యే యూరియా: 13 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఒక్క రోజులో: 3,850 టన్నుల యూరియా, 2,200 టన్నుల అమ్మోనియా తయారుచేస్తారు

తెలంగాణకు కేటాయింపు: 6.5 లక్షల మెట్రిక్‌ టన్నులు,

మిగిలింది: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు

కర్మాగారంలో వాటాల శాతాలు ఇలా

జాతీయ ఎరువుల సంస్థ: 26

ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌: 26

ఎఫ్‌సీఐ: 11

రాష్ట్ర ప్రభుత్వం: 11

భారతీయ స్టేట్‌ బ్యాంకు: 26

ఇదీ చూడండి:రేపే రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము

ABOUT THE AUTHOR

...view details