పర్వత, పర్యాటక ప్రాంతాలకే పరిమితమైన పారాగ్లైడింగ్ తమ ప్రాంతంలో ఎందుకు నిర్వహించకూడదనే పట్టుదలతో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ఆడెపు అర్జున్ గత మూడేళ్లుగా కృషి చేస్తున్నారు. రామగుండం రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు పారాగ్లైడర్ నిర్మాణంపై అవగాహన పెంచుకొని నిర్మించారు. పారాగ్లైడింగ్ ఎక్కువగా జరిగే హిమాచల్‌ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అవగాహన పెంచుకున్నారు. పారాగ్లైడింగ్‌కు సంబంధించిన వాట్సప్ గ్రూపులో చేరి ఎప్పటికప్పుడు సాంకేతికంగా తనకు తానుగా అభివృద్ది పరుచుకున్నారు అర్జున్. దేశవ్యాప్తంగా రిటైర్డు ఆర్మీ అధికారులు, పైలట్లు, క్రీడాకాకారులు, పారాగ్లైడర్ల నుంచి నిర్మాణానికి సంబంధించిన పరిజ్ఞానం పెంచుకున్నారు. దీని నిర్మాణం మనదేశంలో జరగకపోవడం వల్ల... స్వయంగా నిర్మించాలనే పట్టుదలతో అమెరికా, ఇటవీ నుంచి దాదాపు రూ.15 లక్షలతో అవసరమైన సామాగ్రి తెప్పించారు.
పర్యాటకంగా అభివృద్ధి..
ఇటీవల కాళేశ్వరం జలాలు తరలిరావడం వల్ల గోదావరిఖని, రామగుండాన్ని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పారాగ్లైడింగ్‌కు కూడా మంచి అవకాశాలు ఉంటాయని ఆడెపు అర్జున్ చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరు పారాగ్లైడర్ తయారు చేయలేదని... తానే మొట్టమొదటిసారి రూపొందించినట్టు వివరించారు. ఎంతో కష్టపడి రూపొందించిన పారాగ్లైడర్‌లో విన్యాసం... తన స్నేహితులతో కలిసి రామగుండం గ్రౌండ్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో చేపట్టారు. స్నేహితులు, స్థానికుల కేరింతలు ఈలల మధ్య ఉవ్వెత్తున గాలిలో విన్యాసాలు చేశారు. పారాగ్లైడర్ ద్వారా విన్యాసానికి అనుమతివ్వాలంటూ అధికారులకు విన్నవించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని అర్జున్ చెబుతున్నారు.